గడపగడపకు ప్రోగ్రాంలో సీఎం జగన్ అసంతృప్తి.. గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వనని స్పష్టం
ఏపీలోని వైసీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తొందరలోనే పని తీరు మెరుగుపర్చుకోకపోతే తానే ఓ నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే సగం మందికిపైగా శాసనసభ్యుల గ్రాఫ్ మరింత పెరగాల్సి ఉందని జగన్ స్పష్టం చేశారు. పని తీరు బాగుంటేనే ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తామని, పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటే సహించబోమన్నారు.
టిక్కెట్లు రాకుంటే చివరి క్షణంలో నన్ను బాధ్యుడిని చేయొద్దు : సీఎం జగన్
తన వద్ద సర్వే వివరాలు ఉన్నాయని, ఇకపై చేసే సర్వేల్లోనూ కంపల్సరీగా గ్రాఫ్ పెరగాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్తేనే గ్రాఫ్ పెరుగుతుందని, లేకుంటే గ్రాఫ్ పెరగదని జగన్ సూచించారు. పనితీరు బాగాలేకపోతే టిక్కెట్లు ఇవ్వడం కుదరదని, చివరి క్షణంలో తనను బాధ్యుడిని చేయొద్దని ఎన్నికలకు ముందే జగన్ తేల్చిచెప్పారు. మరో 2 రోజుల్లో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం కానుందని, అందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలతో కలిసి ముందుకు సాగాలన్నారు. ప్రతీ సచివాలయానికి ఎమ్మెల్యే, అధికారులతో కలిసి వెళ్లి ప్రజాసమస్యలేంటో నేరుగా తెలుసుకోవాలన్నారు. అడిగిన ప్రతీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. అధికారులు కూడా ఏవీ పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు ఆయా సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.