AP Power Consumption: ఏపీలో పెరిగిన విద్యుత్ డిమాండ్.. 290 ఎంయూ దాటిన రోజువారీ వినియోగం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 290 మిలియన్ యూనిట్లు (ఎంయూ) దాటుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వేసవి కాలాన్ని తలపించేలా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచాలని సూచించారు. విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
వివరాలు
15 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు
థర్మల్, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో యంత్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఎక్కడైనా సాంకేతిక లోపాలు ఏర్పడితే వెంటనే గుర్తించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి థర్మల్ ప్లాంట్ వద్ద కనీసం 15 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
వివరాలు
అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమన్వయం చేసుకుని సరఫరా కొనసాగించాలి
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు పునరుత్పాదక విద్యుత్ వనరులను కూడా సమర్థంగా వినియోగించుకోవాలని గొట్టిపాటి రవికుమార్ సూచించారు.
సౌర, ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా లభించే విద్యుత్‌ను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమన్వయం చేసుకుని సరఫరా కొనసాగించాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జెన్‌కో ఎండీ నాగలక్ష్మి, ట్రాన్స్‌కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్‌చంద్‌తో పాటు వివిధ డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు.