Drought Relief: రైతులకు వ్యవసాయ శాఖ శుభవార్త.. 80% రాయితీపై విత్తనాలు
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 80 శాతం రాయితీపై మొత్తం 90,222 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో తక్కువ నీటితో సాగు చేయగల స్వల్పకాలిక పంటలను రైతులు ఎంచుకోవాలని ఆయన సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా రైతులు భూములను ఖాళీగా ఉంచకుండా ఆదాయం పొందవచ్చని తెలిపారు.
వివరాలు
90,222 క్వింటాళ్ల విత్తనాలు
రాయితీపై అందిస్తున్న విత్తనాల్లో ఉలవలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
మొత్తం 90,222 క్వింటాళ్లలో 54,036 క్వింటాళ్ల ఉలవ విత్తనాలు, 17,953 క్వింటాళ్ల మినుము విత్తనాలు, 2,852 క్వింటాళ్ల కంది విత్తనాలు ఉన్నాయి.
ఈ విత్తనాలను 80 శాతం రాయితీతో రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఒక్కో రైతుకు గరిష్ఠంగా ఐదెకరాల భూమిలో సాగు చేసుకునే మేరకు రాయితీపై విత్తనాలను అందించనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.