Loading...
Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి, జిల్లా స్థాయిలో అధికారులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలకు ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లు, ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలు, వాటి కోసం తీసుకుంటున్న చర్యలపై గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వివరాలు 

పురపాలికల్లో కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టి

రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగర పంచాయతీలన్నింటికీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ తెలిపారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో కోర్టు కేసులు ఎన్నికల ప్రక్రియకు అడ్డంకిగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 23 కేసుల్లో ఇప్పటికే నాలుగు పరిష్కారమయ్యాయని చెప్పారు.

జనాభా ప్రాతిపదికన డివిజన్లు, వార్డుల పునర్విభజనకు సంబంధించిన కీలక కేసులో త్వరలోనే తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు.

అలాగే ఓటర్ల తుది జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనుల్లో కూడా సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సిద్ధం

రాష్ట్రంలోని 13,359 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లతో పాటు న్యాయపరమైన సమస్యలపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

2021లో కోర్టు కేసుల కారణంగా 354 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించలేకపోయామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని పెండింగ్‌ కేసులను పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తయిందని, ఇక పోలింగ్‌ కేంద్రాల ఖరారుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఈవీఎంలా? బ్యాలట్‌ బాక్సులా?

ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో (ఈవీఎంలు) నిర్వహించాలా లేదా బ్యాలట్‌ బాక్సులను వినియోగించాలా అనే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది.

జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ఈవీఎంలు, బ్యాలట్‌ బాక్సుల వివరాలను అధికారులు ఎస్‌ఈసీకి నివేదించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎన్నికల వ్యయంపై ప్రతిపాదనలు సిద్ధం

2021లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సుమారు రూ.3.50 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

ఈసారి ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే వ్యయంపై పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలు విడివిడిగా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

అలాగే బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం మరోసారి సమావేశమై ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించాలని నిర్ణయించారు.

అప్పటిలోపు పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసి, జిల్లా స్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు.

ADVERTISEMENT