Loading...
PG Medical Seats : ఏపీలో పెరిగిన పీజీ మెడికల్ సీట్లు.. మొత్తం 4,196 
ఏపీలో పెరిగిన పీజీ మెడికల్ సీట్లు.. మొత్తం 4,196

PG Medical Seats : ఏపీలో పెరిగిన పీజీ మెడికల్ సీట్లు.. మొత్తం 4,196 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పీజీ వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) మెడికల్ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా 424పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పీజీ మెడికల్ సీట్ల సంఖ్య 3,772 నుంచి 4,196కు చేరింది. ఈ అదనపు సీట్లను రాష్ట్రంలోని 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలకు కేటాయించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 162 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం పీజీ సీట్ల సంఖ్య 1,915 నుంచి 2,077కు పెరిగింది. ప్రైవేట్ వైద్య కళాశాలలకు అదనంగా 262 సీట్లు కేటాయించడంతో వాటి మొత్తం సీట్ల సంఖ్య 1,857 నుంచి 2,119కు చేరింది.

వివరాలు 

పీజీ సీట్ల పెంపుపై వర్సిటీ వీసీ కృతజ్ఞతలు

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విజయనగరం మెడికల్ కాలేజీకి అత్యధికంగా 28 అదనపు సీట్లు లభించాయి.

ప్రైవేట్ కళాశాలల్లో కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు అత్యధికంగా 59 సీట్లు కేటాయించారు.

రాష్ట్రంలో పీజీ వైద్య విద్య విస్తరణకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉపకులపతి (వీసీ) డాక్టర్ పి. చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ), ఇతర అధికారుల సహకారాన్ని ఆయన అభినందించారు.

పీజీ సీట్లు పెరగడం వల్ల మరింత మంది వైద్య పట్టభద్రులకు వివిధ వైద్య విభాగాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం లభిస్తుందని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

వివరాలు 

సీట్ల వివరాలను క్రోడీకరించిన వర్సిటీ

దీనివల్ల రాష్ట్రంలో వైద్య విద్యా సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని, భవిష్యత్తులో ఎక్కువ మంది స్పెషలిస్ట్ వైద్యులను తయారు చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న పీజీ సీట్లతో పాటు అదనంగా మంజూరైన, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం క్రోడీకరించిందని రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్ తెలిపారు.

పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలు అమల్లో ఉన్న నిబంధనలు, కోటాల వారీగా సీట్ల కేటాయింపు, అధికారిక కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ప్రకారం జరుగుతాయని వెల్లడించారు.

కళాశాలల వారీగా సీట్ల లభ్యత, అర్హతలు, కౌన్సెలింగ్ తేదీలు, సీట్ల కేటాయింపు విధానాలు, ఇతర మార్గదర్శకాల కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయం విడుదల చేసే అధికారిక నోటిఫికేషన్లను పరిశీలించాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరిగిన సీట్లు

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా మంజూరైన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం వైద్య కళాశాలకు 28, పాడేరు వైద్య కళాశాలకు 24, రాజమహేంద్రవరం వైద్య కళాశాలకు 20, కర్నూలు వైద్య కళాశాలకు 19, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్‌ వైద్య కళాశాలకు 15 సీట్లు కేటాయించారు.

అలాగే శ్రీకాకుళం, అనంతపురం వైద్య కళాశాలలకు చెరో 12 సీట్లు, గుంటూరు, మచిలీపట్నం కళాశాలలకు చెరో 8 సీట్లు, ఒంగోలు, కడప వైద్య కళాశాలలకు చెరో 7 సీట్లు అదనంగా వచ్చాయి.

విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనా కేంద్రానికి 2 సీట్లు కేటాయించారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రైవేట్ వైద్య కళాశాలల్లోనూ భారీగా పెరిగిన సీట్లు

ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కోనసీమ కిమ్స్‌కు అత్యధికంగా 59సీట్లు అదనంగా మంజూరయ్యాయి.

నంద్యాలలోని శాంతిరామ్ వైద్య కళాశాలకు 55,శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్ట్రన్ వైద్య కళాశాలకు 39, విశాఖపట్నంలోని ఎన్నారై వైద్య కళాశాలకు 33సీట్లు కేటాయించారు.

ఏలూరులోని ఆశ్రమ్ వైద్య కళాశాలకు 27,గుంటూరులోని కాటూరి వైద్య కళాశాలకు 16, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా వైద్య కళాశాలకు 12సీట్లు అదనంగా లభించాయి.

కర్నూలులోని విశ్వభారతి వైద్య కళాశాలకు 8, గన్నవరంలోని పిన్నమనేని వైద్య కళాశాలకు 7, చిత్తూరులోని అపోలో వైద్య కళాశాలకు 6 సీట్లు పెరిగాయి.

ఈ సీట్ల పెంపుతో రాష్ట్రంలో పీజీ వైద్య విద్యకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

వివిధ స్పెషాలిటీల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వైద్య పట్టభద్రులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చనుంది.

ADVERTISEMENT