AP: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ రంగంలో ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అమలు, విద్యుత్ రంగం బలోపేతం లక్ష్యంగా ఈ నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
వివరాలు
సంస్థల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ ట్రాన్స్‌కో - 200 పోస్టులు ఏపీ జెన్‌కో - 100 పోస్టులు ఏపీ ఈపీడీసీఎల్ - 135 పోస్టులు ఏపీ ఎస్‌పీడీసీఎల్ - 134 పోస్టులు ఏపీ సీపీడీసీఎల్ - 60 పోస్టులు మొత్తం 629 పోస్టుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెలికాం)తో పాటు ఇతర విభాగాలకు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి.
వివరాలు
దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి?
ఈ ఉద్యోగాలకు జూన్ 30 నుంచి జూలై 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత కలిగిన ఇంజనీరింగ్ అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. విభాగాల వారీగా పోస్టుల కేటాయింపు ఈ నియామకాల్లో పలు ఇంజనీరింగ్ విభాగాల అభ్యర్థులకు అవకాశం లభించనుంది. ఏపీ జెన్‌కోలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కలిపి 80 పోస్టులు,సివిల్ విభాగంలో 20 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే ఏపీ ట్రాన్స్‌కోలో ఎలక్ట్రికల్ విభాగానికి 167 పోస్టులు, సివిల్‌కు 23 పోస్టులు, టెలికాం విభాగానికి 10 పోస్టులు కేటాయించారు. ఈ భారీ నియామక ప్రకటనతో నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
వివరాలు
మంత్రి ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ కొత్త నియామకాలతో విద్యుత్ సంస్థల పనితీరు మరింత సమర్థవంతంగా మారుతుందని, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో కొత్తగా నియమితులయ్యే ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హత కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.