Loading...
Andhra Pradesh: సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఉద్యోగులకు వన్‌టైమ్ ఆప్షన్
ఉద్యోగులకు వన్‌టైమ్ ఆప్షన్

Andhra Pradesh: సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఉద్యోగులకు వన్‌టైమ్ ఆప్షన్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) నుంచి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)కు మారేందుకు విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ద్వారా జీఓ ఎంఎస్ నంబర్ 158ను జారీ చేసింది. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామక నోటిఫికేషన్ విడుదలై, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్‌లోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పించింది. ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవాలనుకునే ఉద్యోగులు 2026 డిసెంబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ, ఆప్షన్ల పరిశీలన ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం 'నిధి' పోర్టల్‌ను ఉపయోగించనున్నారు.

వివరాలు 

ఓపీఎస్‌కు మారేందుకు ధ్రువపత్రాలు తప్పనిసరి

ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇప్పటికే పదవీ విరమణ పొందినవారు,మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు (ఫ్యామిలీ పెన్షనర్లు) కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఇందుకోసం దరఖాస్తుదారులు తమ తొలి నియామక అధికారి నుంచి కొన్ని కీలక ధ్రువపత్రాలను తప్పనిసరిగా పొందాలి.

నియామక నోటిఫికేషన్, ఎంపిక జాబితా (సెలెక్షన్ లిస్ట్), నియామక ఉత్తర్వులు (అపాయింట్‌మెంట్ ఆర్డర్),విధుల్లో చేరినట్లు ధ్రువీకరించే పత్రాల సర్టిఫైడ్ కాపీలను సమర్పించాలి.

ఉద్యోగులు కోరిన ధ్రువపత్రాలను తొలి నియామక అధికారి 15 పని దినాల్లోగా ధ్రువీకరించిన కాపీల రూపంలో అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఓపీఎస్‌కు మారేందుకు చేసుకున్న ఆప్షన్‌కు ఆమోదం లభించిన వెంటనే సంబంధిత ఉద్యోగులను జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) లేదా ఇతర ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి మారుస్తారు.

వివరాలు 

సీపీఎస్ నిధుల బదిలీపై మార్గదర్శకాలు

ఇందుకు అవసరమైన నిబంధనలను రూపొందించనున్నారు.

సీపీఎస్ ఖాతాలో ఉన్న నిధుల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

సీపీఎస్ కార్పస్ ఫండ్‌లో ఉద్యోగి జమ చేసిన వాటాను వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.

ప్రభుత్వ వాటాతో పాటు దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాకు మళ్లించేలా ఆర్థిక శాఖ చర్యలు తీసుకోనుంది.

ADVERTISEMENT