Swayam AP: 'స్వయం-ఏపీ' బ్రాండ్‌తో దేశ, విదేశాలకు డ్వాక్రా ఉత్పత్తులు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలోని డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న పచ్చళ్లు, కారంపొడులు, అగరబత్తీలు సహా వివిధ ఉత్పత్తులకు ఇకపై మరింత విస్తృత మార్కెట్ లభించనుంది. ఇప్పటి వరకు కొన్ని గ్రామాలు, పట్టణాలకే పరిమితమైన ఈ ఉత్పత్తులను రాష్ట్ర సరిహద్దులు దాటి దేశ, విదేశీ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. డ్వాక్రా చరిత్రలో తొలిసారిగా 'స్వయం-ఏపీ' బ్రాండ్ పేరుతో ఈ ఉత్పత్తులను ప్రభుత్వమే మార్కెటింగ్ చేయనుంది. ఉత్పత్తుల ప్యాకింగ్, బ్రాండింగ్, ప్రచారం, విక్రయాలు వంటి అన్ని దశల్లో మహిళలకు అండగా నిలవనుంది.
వివరాలు
పైలట్ ప్రాజెక్టు కింద తొలి విడతలో 60 ఉత్పత్తుల ఎంపిక
గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. తొలిదశలో పట్టణ ప్రాంత వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు ప్రారంభించి, అనంతరం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలి విడతలో 60 ఉత్పత్తులను ఎంపిక చేశారు. ఇందుకు సుమారు రూ.10 కోట్ల వ్యయం చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి ఈ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉత్పత్తుల సంఖ్యను 100కు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్ పరిధిలో సుమారు 86 లక్షల మంది డ్వాక్రా మహిళలు
రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్ పరిధిలో సుమారు 86 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. వీరు వందల రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నప్పటికీ, వాటి మార్కెటింగ్ విషయంలో ఇప్పటి వరకు సమగ్ర వ్యవస్థ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు. గతంలో ఆన్‌లైన్ ద్వారా విక్రయాలకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మార్కెటింగ్, నాణ్యత ప్రమాణాలు, ప్యాకింగ్, లైసెన్సింగ్, న్యాయపరమైన అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రెండు ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొదటి దశలో మార్కెటింగ్‌కు ఎంపిక చేసిన 60 ఉత్పత్తుల్లో ప్రతి జిల్లాకు రెండు లేదా మూడు ఉత్పత్తులు ఉండేలా ప్రాధాన్యం ఇచ్చారు.
వివరాలు
విశాఖ, విజయవాడల్లో ఆర్డర్ ప్రాసెసింగ్ కేంద్రాలు
ఆన్‌లైన్ విక్రయాలను మరింత విస్తరించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఓఎన్‌డీసీ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వేదికలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. వినియోగదారులకు ఉత్పత్తులను సకాలంలో చేరవేయడం కోసం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉత్పత్తి ప్రాంతాల నుంచి నేరుగా సరఫరా చేయడంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం, విజయవాడల్లో కేంద్రీకృత ఆర్డర్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉత్పత్తుల ఆర్డర్ల స్వీకరణ, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా తదితర ప్రక్రియలు ఈ కేంద్రాల నుంచే నిర్వహించనున్నారు.
వివరాలు
'స్వయం-ఏపీ' బ్రాండ్ ద్వారా డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు కొత్త గుర్తింపు
అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా లేదా విక్రయాల్లో జాప్యం జరిగినా డ్వాక్రా మహిళలు నష్టపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మహిళల నుంచి ఉత్పత్తులను సేకరించే సమయంలోనే ముందుగా నిర్ణయించిన ధరను వారికి చెల్లించనున్నారు. దీంతో విక్రయాలపై ఆధారపడి ఆదాయం ఆలస్యం కాకుండా భరోసా కల్పించనున్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌తో పాటు ప్రత్యక్ష విక్రయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం విజయవాడ, విశాఖపట్నంలో మూడేసి చొప్పున ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసి డ్వాక్రా ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 'స్వయం-ఏపీ' బ్రాండ్ ద్వారా డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు కొత్త గుర్తింపు తీసుకురావడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
వివరాలు
తొలి విడతలో ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల వివరాలు..
తూర్పుగోదావరి జిల్లా : అగరబత్తీ, అజ్జరం ఇత్తడి వస్తువులు, జీడిపప్పు, ధోవతులు, మామిడికాయ పచ్చడి, రాగి టీ కప్పులు కర్నూలు : మిల్లెట్స్ విజయనగరం : రూమ్ ఫ్రెషనర్ ఆయిల్‌్్స, బెల్లంపొడి, మామిడి తాండ్ర డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ : బెల్లం పూతరేకులు చిత్తూరు : కర్పూరం, జిల్లేడు వినాయకులు గుంటూరు : కారం పొడులు, గోంగూర పచ్చడి, చేతితో దంచిన మసాలాలు, పండు మిర్చి పచ్చడి, పసుపు పొడి పశ్చిమగోదావరి : చాక్లెట్లు, లేస్ అల్లూరి సీతారామరాజు : కాఫీ ఎన్టీఆర్ : కొండపల్లి బొమ్మలు, గానుగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె, నువ్వుల నూనె, అల్లంపొడి,
వివరాలు
తొలి విడతలో ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల వివరాలు..
శ్రీసత్యసాయి : కోల్డ్ ప్రెస్డ్ పొద్దుతిరుగుడు నూనె, మిల్లెట్ ప్రోటీన్ పొడులు అనకాపల్లి : ఏటికొప్పాక బొమ్మలు, మాడుగుల హల్వా పార్వతీపురం మన్యం : చేతితో తయారు చేసిన సబ్బులు, చీపురు కట్టలు ప్రకాశం : తేనె కర్నూలు : కొర్రలు, ఊదలు అనంతపురం : తోలుబొమ్మలు, ధర్మవరం చీరలు విశాఖ : చిరుధాన్యాల మిశ్రమం, పేపర్ ప్లేట్లు పల్నాడు : అప్పడాలు శ్రీకాకుళం : నువ్వుల అప్పడాలు అన్నమయ్య : టెర్రకోట మట్టి వాటర్ బాటిళ్లు, రెడీ టు ఈట్ మిల్లెట్ ఉత్పత్తులు మంగళగిరి : వెంకటగిరి చీరలు తిరుపతి : చెక్క వస్తువులు (శ్రీవారి ప్రతిమలు) నెల్లూరు : చెక్క కత్తిపీటలు/స్పూన్లు
వివరాలు
తొలి విడతలో ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల వివరాలు..
కడప : వనిపెంట ఇత్తడి వస్తువులు, మాధవరం పట్టు చీరలు నంద్యాల : నంద్యాల పట్టు చీరలు కాకినాడ : కాజా, ఉప్పాడ పట్టు చీరలు బాపట్ల : కుప్పడం చీరలు కృష్ణా : పెడన కలంకారీ