AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు బ్రేక్.. పలు సర్వీసులు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలోని పలు విమానాశ్రయాల్లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలు ల్యాండ్ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించగా.. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. ఈ పరిణామాలతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విశాఖ-విజయవాడ విమానం శంషాబాద్‌కు మళ్లింపు విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ కాలేకపోయింది. దీంతో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
వివరాలు
హైదరాబాద్-రాజమండ్రి విమానం బెంగళూరుకు మళ్లింపు
హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 591 విమానం కూడా వాతావరణ పరిస్థితుల కారణంగా రాజమండ్రిలో దిగలేకపోయింది.
దీంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడ-విశాఖ విమాన సర్వీసులు రద్దు
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సమాచారం.
మరోవైపు చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కూడా విజయవాడ నుంచి వెనక్కి పంపించారు.
వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
వివరాలు
భోగాపురంలో ల్యాండ్ కాని ఎయిర్ ఇండియా విమానం
భారీ వర్షాల ప్రభావంతో భోగాపురం విమానాశ్రయంలోనూ విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విజయవాడ నుంచి బుధవారం రాత్రి 8:35 గంటలకు భోగాపురం బయలుదేరిన ఎయిర్ ఇండియా IX 1373 విమానం రాత్రి 9:40 గంటలకు అక్కడ ల్యాండ్ కావాల్సి ఉంది.
అయితే భోగాపురంలో భారీ వర్షం కారణంగా సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు.
ఆ విమానంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు.
భోగాపురంలో ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించారు.
చివరకు ఎయిర్ ఇండియా IX 1373 విమానం నాగ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది.
దాదాపు రెండు గంటల ఉత్కంఠ అనంతరం విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలు
ప్రయాణికులకు కీలక సూచనలు
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రయాణానికి బయలుదేరే ముందు తమ విమానం రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎయిర్‌లైన్ సంస్థల అధికారిక మార్గాల్లో పరిశీలించాలని తెలిపారు.
విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్‌ను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించారు.