Loading...
DigiVerify platform: ఏపీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఇక డిజివెరిఫై.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఏపీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఇక డిజివెరిఫై.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

DigiVerify platform: ఏపీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఇక డిజివెరిఫై.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సర్టిఫికెట్ల తనిఖీ విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై వివిధ అవసరాల కోసం సమర్పించే ప్రభుత్వ ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ను 'ఏపీ డిజివెరిఫై' ప్లాట్‌ఫామ్‌ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మాన్యువల్ వెరిఫికేషన్‌కు బదులుగా డిజిటల్ విధానం విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందే సమయంలో సమర్పించే ధ్రువపత్రాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ ప్రయోజనాలను పొందేందుకు ఉపయోగించే సర్టిఫికెట్లను కూడా ఇకపై మాన్యువల్‌గా పరిశీలించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటి ధ్రువీకరణను ఏపీ డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌ ద్వారానే పూర్తి చేయాలని ఆదేశించింది.

వివరాలు 

ఫిజికల్ కాపీలకు బదులు డిజిటల్ వెరిఫికేషన్

ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేస్తున్న అనేక సర్టిఫికెట్లు డిజిటల్ రూపంలోనే అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఫిజికల్ కాపీలపై ఆధారపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత ధ్రువపత్రాలను డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌ ద్వారా పరిశీలించి ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.

నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట

డిజివెరిఫై విధానం అమలుతో నకిలీ ధ్రువపత్రాల వినియోగానికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.

సర్టిఫికెట్ వివరాలను సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నేరుగా పరిశీలించే అవకాశం ఉండటంతో, వాటి అసలుదనాన్ని త్వరగా నిర్ధారించవచ్చని పేర్కొంది.

దీంతో వెరిఫికేషన్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

వివరాలు 

అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లకు ఇదే విధానం

ప్రభుత్వం జారీ చేసే అన్ని రకాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏపీ డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌నే ఉపయోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

సంబంధిత ధ్రువపత్రం ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటే దానిని మాన్యువల్‌గా తనిఖీ చేయడానికి అవకాశం ఉండదు.

డిజివెరిఫైలో లేని పత్రాలకే మాన్యువల్ పరిశీలన

అయితే ఏపీ డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో లేని ధ్రువపత్రాలకు మాత్రం మాన్యువల్ వెరిఫికేషన్‌ చేసేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

అంటే డిజివెరిఫైలో రికార్డు లేని సందర్భాల్లో మాత్రమే ప్రత్యామ్నాయంగా భౌతిక ధ్రువీకరణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది.

ఈ విధానం ద్వారా ప్రభుత్వ సర్టిఫికెట్ల తనిఖీలో డిజిటల్ ప్రక్రియకు ప్రాధాన్యం పెరగడంతో పాటు, ధ్రువపత్రాల నిజానిజాలను వేగంగా నిర్ధారించే అవకాశం ఏర్పడనుంది.

ADVERTISEMENT