Loading...
Andhra Pradesh GST Model: ఏఐతో జీఎస్టీ వసూళ్లలో ఏపీ సంచలనం.. ఆరు నెలల్లోనే రూ.743 కోట్లు!
: ఏఐతో జీఎస్టీ వసూళ్లలో ఏపీ సంచలనం.. ఆరు నెలల్లోనే రూ.743 కోట్లు!

Andhra Pradesh GST Model: ఏఐతో జీఎస్టీ వసూళ్లలో ఏపీ సంచలనం.. ఆరు నెలల్లోనే రూ.743 కోట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నులశాఖ అమలు చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. శుక్రవారం దిల్లీలో నిర్వహించిన జీఎస్టీ ఆరో జాతీయ సమన్వయ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ తరఫున ఈ ఏఐ ఆధారిత జీఎస్టీ పాలనా నమూనాపై ప్రజంటేషన్‌ ఇచ్చినట్లు ఆ శాఖ ప్రధాన కమిషనర్‌ ఎ.బాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జీఎస్టీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌, సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇండైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ), వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వాణిజ్య పన్నుల కమిషనర్లు, సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

వివరాలు

గతంలో రూ.365.75 కోట్లు మాత్రమే ఆదాయం

పన్ను పరిపాలనలో ఏఐ ఆధారిత వ్యవస్థలను ఏ విధంగా ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారో ఎ.బాబు వివరించారు.

ఏఐ సాయంతో జీఎస్టీ రిటర్నులను పరిశీలించడం ద్వారా కేవలం ఆరు నెలల్లోనే రూ.743.43 కోట్ల ఆదాయాన్ని సాధించగలిగినట్లు ఆయన తెలిపారు.

గతంలో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించినప్పుడు రూ.365.75 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చేదని పేర్కొన్నారు. దీంతో ఏఐ ఆధారిత విధానం ద్వారా ఆదాయ సమీకరణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు వివరించారు.

ఈ నమూనాను పరిశీలించిన అనంతరం తమిళనాడు, బిహార్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోనూ దీనిని అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఎ.బాబు తెలిపారు.

ఈ విధానంపై అవగాహన కోసం ఆయా రాష్ట్రాల బృందాలు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.

ADVERTISEMENT