Loading...
AP Municipal Elections 2026 : ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్.. నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్.. నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు!

AP Municipal Elections 2026 : ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్.. నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. సవరించిన షెడ్యూల్‌ను గురువారం రాత్రి విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు నవంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబరు 2న రీపోలింగ్ చేపట్టి, నవంబరు 3న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. గతంలో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన మైదుకూరు పురపాలక సంఘంలోని మొత్తం 32 వార్డులతో పాటు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజంపేట పురపాలక సంఘంలోని 11 వార్డులకు నామినేషన్ల దాఖలు గడువును పొడిగించారు.

వివరాలు 

కడప, తిరుపతి సహా నాలుగు పట్టణ సంస్థల్లో 72 వార్డులకు మళ్లీ నామినేషన్లు

వీటితో పాటు కడప నగరపాలక సంస్థలోని 11, తిరుపతి నగరపాలక సంస్థలోని 18 డివిజన్లకు కూడా కొత్తగా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

మొత్తంగా మైదుకూరు, రాజంపేట పురపాలక సంఘాలు, కడప, తిరుపతి నగరపాలక సంస్థల్లోని 72 వార్డులు, డివిజన్లకు మళ్లీ నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న కొందరు అభ్యర్థులను బెదిరించడం, దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చించివేయడం వంటి ఘటనల కారణంగా వారు నామినేషన్లు దాఖలు చేయలేకపోయినట్లు ఎన్నికల సంఘం గుర్తించింది.

అలాంటి అభ్యర్థులకు మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించినట్లు స్పష్టం చేసింది.

వివరాలు 

అక్టోబరు 23, 24 తేదీల్లో నామినేషన్లు

సవరించిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబరు 23, 24 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు.

అక్టోబరు 25న ఉదయం నామినేషన్ల పరిశీలన చేపట్టి, అదే రోజు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు.

ఈ మార్పులతో సంబంధం లేని ఇతర పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికే ప్రకటించిన నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు.

తొలుత రాష్ట్ర ఎన్నికల సంఘం 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించి, అక్టోబరు 21న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించింది.

అయితే, తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ADVERTISEMENT

వివరాలు 

అక్టోబరు 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ వాయిదా

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబరు 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది.

పిటిషన్ వేసిన పార్టీ, అభ్యర్థులు సమర్పించిన వినతులు, సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించాలని సూచించింది.

శాంతిభద్రతల సమస్యల కారణంగా కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయినట్లు తేలితే, వారికి మరో అవకాశం కల్పించాలని పేర్కొంది.

అవసరమైతే నామినేషన్ల గడువును పొడిగించాలని ఆదేశించింది.

ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబరు 22లోగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది.

గడువు పొడిగించాలని నిర్ణయిస్తే, సంబంధిత నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుంచి కనీసం 48 గంటల సమయం ఉండేలా చూడాలని నిర్దేశించింది.

ADVERTISEMENT

వివరాలు 

కలెక్టరేట్ల ప్రాంగణాల్లోనూ నామినేషన్లు దాఖలు చేసుకునే సదుపాయం

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రాత్రి ప్రకటించింది.

అనంతరం అన్ని పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల నుంచి నివేదికలు తెప్పించింది.

గురువారం వాటిని పరిశీలించడంతో పాటు ఎలక్ట్రానిక్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.

ఈ పరిశీలన అనంతరం మైదుకూరు, రాజంపేట పురపాలక సంఘాలు, కడప, తిరుపతి నగరపాలక సంస్థల్లోని 72 వార్డులు, డివిజన్లకు తిరిగి నామినేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది.

గతంలో ప్రకటించిన నామినేషన్ కేంద్రాలతో పాటు అదనంగా జిల్లా కలెక్టరేట్ల ప్రాంగణాల్లోనూ నామినేషన్లు దాఖలు చేసుకునే సదుపాయం కల్పించింది.

వివరాలు 

అక్టోబరు 25న అభ్యర్థుల తుది జాబితా

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 21న అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించాల్సి ఉండగా, అక్టోబరు 28న పోలింగ్, 29న అవసరమైన చోట రీపోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది.

తాజా మార్పుల ప్రకారం అక్టోబరు 25న అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తారు.

నవంబరు 1న పోలింగ్, 2న అవసరమైన చోట రీపోలింగ్, 3న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల తేదీలోనూ మార్పు చోటుచేసుకుంది.

సిరిమాను ఉత్సవం కారణంగా అక్కడ అక్టోబరు 28కు బదులుగా అక్టోబరు 29న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించింది.

అయితే, ఇప్పుడు మొత్తం ఎన్నికల షెడ్యూల్ మారడంతో విజయనగరం నగరపాలక సంస్థకు కూడా నవంబరు 1నే పోలింగ్ నిర్వహించనున్నారు.

ADVERTISEMENT