LOADING...
AP Governor: కూటమి ప్రభుత్వంతో ఏపీ పునరుద్ధరణ నుంచి ప్రగతి పథంలోకి : గవర్నర్

AP Governor: కూటమి ప్రభుత్వంతో ఏపీ పునరుద్ధరణ నుంచి ప్రగతి పథంలోకి : గవర్నర్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వ్యాఖ్యానించారు. వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అప్పటి ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అయితే 2019లో చోటు చేసుకున్న ప్రభుత్వ మార్పు రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తన ప్రసంగాన్ని చేశారు.

వివరాలు 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అవకాశం

2019 తరువాత రాష్ట్రంలో పాలనా వ్యవస్థల్లో లోపాలు పెరిగాయని, అభివృద్ధి ప్రక్రియ ఆగిపోయిందని గవర్నర్‌ పేర్కొన్నారు. ఆర్థిక భారం పెరగడంతో పాటు కీలక వ్యవస్థలు దెబ్బతిన్నాయని, మౌలిక సదుపాయాలు, విద్యుత్‌, సాగునీటి పారుదల వంటి రంగాలు తీవ్రంగా వెనుకబడ్డాయని చెప్పారు. గత అనుభవాలతో విసుగెత్తిన ప్రజలు చివరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. గత 19 నెలలుగా ప్రభుత్వం పునరుద్ధరణ దశను దాటి ప్రగతి దిశగా ముందుకుసాగుతోందని, సూపర్‌-6 సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు.

వివరాలు 

విధానాలు, వ్యవస్థలు, ఖర్చుల ప్రాధాన్యాల్లో కీలక మార్పులు

అభివృద్ధి కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని విధానాలు, వ్యవస్థలు, ఖర్చుల ప్రాధాన్యాల్లో కీలక మార్పులు తీసుకొచ్చామని గవర్నర్‌ వెల్లడించారు. ఏడు శ్వేతపత్రాల విడుదల ద్వారా పాలనలో పారదర్శకతను బలపరిచామని, సంక్షేమం-అభివృద్ధి మధ్య సమతుల్యం సాధించేందుకు పది సూత్రాలను రూపొందించామని చెప్పారు. సంపద సృష్టించే స్థిరమైన అభివృద్ధి చక్రాన్ని నిర్మించడమే ఈ విధానాల ప్రధాన ఉద్దేశమని, స్వర్ణాంధ్ర విజన్‌ రాష్ట్రానికి స్పష్టమైన ఆర్థిక దిశను సూచిస్తోందని ఆయన తన ప్రసంగంలో వివరించారు.

Advertisement

వివరాలు 

వైకాపా సభ్యుల ఆటంకం

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్‌తో పాటు వైకాపా సభ్యులు హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం జరుగుతున్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పదేపదే ఆటంకం కలిగించారు. కొద్దిసేపటి తర్వాత జగన్‌తో పాటు వైకాపా ఎమ్మెల్యేలు సభను వీడి బయటకు వెళ్లిపోయారు.

Advertisement