AP Parishad Elections: ఏపీ వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. 2.61 కోట్ల మంది ఓటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 2,128 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఎంపీటీసీ పదవులకు 18,843 మంది, జడ్పీటీసీ పదవులకు 2,169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా 2,01,116 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది
పోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,01,116 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు.
వీరిలో రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ప్రిసైడింగ్ అధికారులు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు ఉన్నారు.
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
ఈ ప్రాంతాల్లో గురువారం జరగాల్సిన పోలింగ్‌ను శుక్రవారానికి మార్చారు. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వివరాలు
పరిషత్ ఎన్నికలకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు
ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో పూర్తిగా పోలింగ్‌ను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ నామినేషన్లు, మున్సిపల్ పోలింగ్ సమయంలో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని పరిషత్ ఎన్నికలకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పల్నాడు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో ఏపీఎస్పీకి చెందిన 111 ప్లటూన్ల అదనపు బలగాలను మోహరించారు.