AP rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు.. ఆందోళనలో రైతులు
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. సముద్ర మట్టం వద్ద నుంచి ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీలంక నుంచి నైరుతిని ఆనుకుని ఉన్న పశ్చిమ, మధ్య బంగాళాఖాతం ద్రోణి ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ చెప్పింది. మంగళవారం రాత్రి, బుధవారం ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమలోలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం ఉండొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ద్రోణి ప్రభావం వల్ల సోమవారం అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. పంటలు కోసే సీజన్ కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం రాత్రి, బుధవారం ఈ కింద ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ-మహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్-నికోబార్ దీవులు, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, లక్షద్వీప్‌లలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కోస్టల్ కర్ణాటక, సౌత్ ఇంటీరియర్ కర్నాటకలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.