LOADING...
Amaravati: అమరావతిలో అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌కు శ్రీకారం.. ఎంవోయూపై సంతకాలు

Amaravati: అమరావతిలో అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌కు శ్రీకారం.. ఎంవోయూపై సంతకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా ఆధునిక డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగు పడింది. ఈ లక్ష్యంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఎయిర్‌బౌండ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. గురువారం దిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ, ఎయిర్‌బౌండ్ వ్యవస్థాపకుడు నమన్ పుష్ప్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అమరావతి,విజయవాడ,గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ డ్రోన్ సేవలు ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఎయిర్‌బౌండ్ సంస్థ లాజిస్టిక్స్,ఈ-కామర్స్, హెల్త్‌కేర్ రంగాల్లోని భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేయనుంది.

వివరాలు 

మెరుగైన కనెక్టివిటీతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు

వచ్చే ఏడాది నుంచి రోజుకు 10 వేల డ్రోన్ విమానాలను నిర్వహించే లక్ష్యంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, స్వదేశీ సంస్థతో భాగస్వామ్యం ద్వారా దేశంలోనే అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మెరుగైన కనెక్టివిటీతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించవచ్చని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ, ఎయిర్‌బౌండ్ సంస్థ కేవలం కొత్త తరహా డెలివరీ సేవలను మాత్రమే తీసుకురావడం కాకుండా, రాష్ట్రంలో ఆధునిక లాజిస్టిక్స్ వ్యవస్థ అభివృద్ధికి బలమైన పునాది వేయనున్నట్లు తెలిపారు.

వివరాలు 

20 టన్నుల ట్రక్ సామర్థ్యానికి సమానంగా పనిచేసే డ్రోన్ నెట్‌వర్క్

ఎయిర్‌బౌండ్ వ్యవస్థాపకుడు, సీఈవో నమన్ పుష్ప్ మాట్లాడుతూ, డ్రోన్ డెలివరీ వ్యవస్థ భవిష్యత్తులో వస్తు రవాణా రంగాన్నే పూర్తిగా మార్చివేస్తుందని అన్నారు. 20 టన్నుల ట్రక్ సామర్థ్యానికి సమానంగా పనిచేసే డ్రోన్ నెట్‌వర్క్‌ను రూపొందించి, ఒక్కో ప్యాకేజీని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా చేరవేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజధాని ప్రాంతంలో డ్రోన్‌ డెలివరీ నెట్‌వర్క్

Advertisement