Chandrababu: ఆక్వా ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం.. నాణ్యత పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను గణనీయంగా పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన 'నేషనల్ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్' వర్క్‌షాప్‌లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి
సీఫుడ్ ఎగుమతుల రంగంలో గత పదేళ్లలో విశేష పురోగతి సాధించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు 5 శాతం స్థాయిలో ఉన్న వృద్ధి ప్రస్తుతం 70 శాతానికి చేరుకుందని తెలిపారు. తక్కువ సమయంలోనే అధిక పరిమాణంలో ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. దేశంలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోందని చెప్పారు. దేశ మత్స్యసంపదలో ఏపీదే కీలక వాటా దేశంలోని మొత్తం మత్స్యసంపదలో 28 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని సీఎం వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న రొయ్యల్లో 66 శాతం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుండగా, సీఫుడ్ ఎగుమతుల ద్వారా లభించే ఆదాయంలో 38 శాతం ఏపీ నుంచే వస్తోందని వివరించారు.
వివరాలు
ఆక్వా రంగానికి కేంద్రం మద్దతు అవసరం
రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. రొయ్యల ఉత్పత్తిని మరింత పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. విశాఖపట్నం, భీమవరం, కాకినాడ, నెల్లూరు, కృష్ణపట్నం ప్రాంతాలు ఆక్వా ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన చేపల, రొయ్యల కుంటలు కూడా సంపద సృష్టిస్తున్నాయని తెలిపారు.
వివరాలు
పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండ
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా తనను నేరుగా కలవవచ్చని, అవసరమైతే ఫోన్ ద్వారా సంప్రదించి రావచ్చని చంద్రబాబు అన్నారు.