Loading...
Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు కొత్త దిశ.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
పీపీపీ ప్రాజెక్టులకు కొత్త దిశ..

Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు కొత్త దిశ.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్'లో భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ)ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ఆధారంగా అమలు చేసే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పాలసీ-1.0ను రూపొందించి,వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చకు తీసుకురావాలని సూచించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరితగతిన సిద్ధం చేసి విడుదల చేయాలని పేర్కొన్నారు. గురువారం రాష్ట్రంలోని పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ,దేశవ్యాప్తంగా ప్రస్తుతం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో వివిధ రంగాల్లో ప్రాజెక్టులను చేపడితే అభివృద్ధి వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

సాగునీటి సంఘాలు కూడా కీలక పాత్ర

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విధానాలను అధ్యయనం చేసి, వాటిలో ఉపయోగకరమైన అంశాలను రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులకు సూచించారు.

స్వర్ణాంధ్ర-2047 విజన్లోని మైక్రో, మాక్రో లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రూపొందించాలని చెప్పారు.

భవిష్యత్తులో పరిశ్రమలకు నీటి సరఫరా ద్వారా జలవనరుల శాఖకు ఆదాయ వనరులు పెరుగుతాయని, ఈ ప్రక్రియలో సాగునీటి సంఘాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు.

పోర్టులు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించే విధంగా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.

వివరాలు 

వైద్య కళాశాలల అభివృద్ధికి రూ.1,468 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్

కోస్తా ప్రాంత పర్యాటక అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములను చేసి, వారికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అలాగే రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల వద్ద మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలకు అవకాశాలు సృష్టించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్భంగా అధికారులు సీఎంకు పలు వివరాలు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల అభివృద్ధికి రూ.1,468 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే విజయవాడ, తిరుపతిలో చెత్త నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్రాజెక్టులకు రూ.178 కోట్లు అందిస్తున్నట్లు వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

పీపీపీ విధానంలో 260 ప్రాజెక్టులు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ.1,23,229 కోట్ల విలువైన పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ విధానంలో అమలవుతున్నాయని పేర్కొన్నారు.

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల ప్రకారం రాష్ట్రానికి ప్రతి ఏడాది రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేశారు.

ఈ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్ల పరిధిలో అమలు కానున్నాయని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రతి శాఖకు ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి

ప్రతి ప్రభుత్వ శాఖ స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.

శాఖల ఆదాయ వనరులను పెంచే దిశగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచేలా ప్రభుత్వ శాఖలు పీపీపీ ప్రాజెక్టులను చేపట్టాలని, ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ముందుగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకునే పరిస్థితిని కల్పించాలని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు 

ప్రతి శాఖకు ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి

పట్టణాల్లో ప్రధాన రహదారులకు సమీపంగా మినీ టౌన్‌షిప్‌ల తరహాలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే స్థాయికి చేరుకునేలా వారికి నాణ్యమైన విద్య, అవసరమైన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ADVERTISEMENT