'Swayam AP': డ్వాక్రా ఉత్పత్తులకు 'స్వయం ఏపీ' బ్రాండ్.. దసరా నాటికి మార్కెట్‌లోకి..
ఈ వార్తాకథనం ఏంటి
పట్టణ మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సెర్ప్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలిదశలో 65 రకాల ఉత్పత్తులను ఎంపిక చేసి 'స్వయం-ఏపీ' బ్రాండ్ పేరుతో దసరా నాటికి మార్కెట్‌లోకి తీసుకురావాలని నిర్ణయించారు. వీటిలో 30 ఆహార ఉత్పత్తులు, 35 ఆహారేతర ఉత్పత్తులు ఉన్నాయి. పట్టణాల్లో స్పందనను బట్టి అనంతరం గ్రామీణ మార్కెట్‌కూ విస్తరించనున్నారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు డ్వాక్రా చరిత్రలో తొలిసారిగా 'స్వయం-ఏపీ' పేరుతో ప్రత్యేక బ్రాండింగ్ కల్పిస్తున్నారు. ఉత్పత్తుల ప్యాకింగ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రభుత్వం సహకారం అందించనుంది. ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవహారాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) పర్యవేక్షిస్తోంది.
వివరాలు
జిల్లాకో అగ్రిగేషన్ సెంటర్
భవిష్యత్తులో నిపుణులతో కూడిన ప్రత్యేక సంస్థను మార్కెటింగ్ కోసం తీసుకురావాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది.
డ్వాక్రా సంఘాల నుంచి ఉత్పత్తులను ఆయా జిల్లాల సమాఖ్యలు కొనుగోలు చేయనున్నాయి.
జిల్లాలో సేకరించిన ఉత్పత్తులన్నింటినీ నిల్వ చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక గోదాం ఏర్పాటు చేయనున్నారు.
వీటిని 'అగ్రిగేషన్ సెంటర్లు'గా పిలుస్తారు. ఇవి జిల్లా సమాఖ్యల పరిధిలోనే పనిచేస్తాయి.
అగ్రిగేషన్ సెంటర్ల నుంచే ఆర్డర్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, లాజిస్టిక్స్ సమన్వయం జరుగుతుంది.
అన్ని జిల్లాల సమాఖ్యల నుంచి అవసరానికి అనుగుణంగా ఉత్పత్తులను ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లకు తరలిస్తారు.
విజయవాడ, విశాఖపట్నంలో ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి ఈ-కామర్స్ వేదికల ద్వారా డ్వాక్రా ఉత్పత్తుల విక్రయాలు చేపట్టనున్నారు.
వివరాలు
ఎన్‌ఏబీఎల్ పరీక్షల తర్వాతే..
డ్వాక్రా సంఘాల నుంచి సేకరించే ఆహార ఉత్పత్తుల నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
నాణ్యత ప్రమాణాలు పక్కాగా ఉండేలా నేషనల్ ఎక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్)లో ఉత్పత్తులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తొలిదశలో మార్కెటింగ్‌కు ఎంపిక చేసిన 35 ఆహార ఉత్పత్తులను ఎన్‌ఏబీఎల్‌కు పంపించారు. ఇప్పటికే 20 ఉత్పత్తులకు పరీక్షల అనంతరం అనుమతి లభించింది.
మిగిలిన ఉత్పత్తులకు సంబంధించిన నివేదికల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
నాణ్యత పరీక్షల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆయా ఉత్పత్తులను మార్కెటింగ్‌లోకి తీసుకురానున్నారు.
వివరాలు
రిటైల్ విక్రయాలకూ ఏర్పాట్లు
ఈ-కామర్స్ ద్వారా ఆన్‌లైన్ విక్రయాలు చేపట్టడంతోపాటు వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు నాలుగు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నారు.
వీటికి 'సిగ్నేచర్ సెంటర్లు'గా పేరు పెట్టారు. విజయవాడ బందర్‌రోడ్డులోని బాపు మ్యూజియం సమీపంలో ఒకటి, గొల్లపూడిలో మరోటి ఏర్పాటు చేయనున్నారు.
విశాఖపట్నంలోని సీతమ్మధార, అశిల్‌మెట్టలో మరో రెండు సిగ్నేచర్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ కేంద్రాల ద్వారా డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించనున్నారు.