APPSC Group 1: ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వయోపరిమితిపై కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈసారి గ్రూప్-1 పోస్టుల్లో పలు కీలక మార్పులు చేశారు.
వివరాలు
గ్రూప్-1లో కొత్తగా డీఈఓ, డీఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టులు
ఈసారి జిల్లా విద్యాధికారి (డీఈఓ), డీఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టులను కొత్తగా గ్రూప్-1 పరిధిలోకి తీసుకొచ్చారు.
నిరుద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచారు.
నాన్ యూనిఫాం ఉద్యోగాలకు గరిష్ఠంగా 44 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.
డీఎస్పీ పోస్టులకు 30 ఏళ్ల వయోపరిమితి
డీఎస్పీ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 30 ఏళ్లుగా నిర్ణయించారు. వయసును లెక్కించేందుకు జులై 1వ తేదీని ప్రామాణికంగా తీసుకోనున్నారు.
గ్రూప్-1 స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్షను జనవరి 24న నిర్వహించనున్నారు.
కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా ఓటీపీఆర్ (OTPR) నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు
స్క్రీనింగ్ పరీక్షకు మూడు పరీక్ష కేంద్రాల ఐచ్ఛికాలు
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం గ్రూప్-1 పోస్టులను కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోన్ పోస్టులుగా విభజించారు.
స్క్రీనింగ్ పరీక్ష కోసం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు తమకు అనుకూలమైన మూడు పరీక్షా కేంద్రాల ఐచ్ఛికాలను ఇవ్వాల్సి ఉంటుంది.
గ్రూప్-1 ప్రధాన పరీక్షను మాత్రం నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం నగరాల్లో ప్రధాన పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
వీటిలో అభ్యర్థులు తమకు నచ్చిన ఒక పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.