APTRANSCO: ఏపీట్రాన్స్‌కోలో 200 ఏఈఈ పోస్టులు.. మెరిట్‌తోనే ఎంపిక, వదంతులకు చెక్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే కొనసాగుతుందని ఏపీట్రాన్స్‌కో స్పష్టం చేసింది. నియామకాలలో ఎలాంటి పలుకుబడి, సిఫార్సులు లేదా అక్రమాలకు అవకాశం ఉండదని సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (విజిలెన్స్ అండ్ హెచ్‌ఆర్‌డీ) సూర్య సాయి ప్రవీణ్ చంద్ వెల్లడించారు. మొత్తం ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించబడుతుందని, గేట్ (GATE), యూజీసీ-నెట్ (UGC-NET) వంటి జాతీయ స్థాయి పరీక్షల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని ఆయన తెలిపారు.
వివరాలు
వదంతులను నమ్మొద్దని సూచన
ఏఈఈ నియామకాల పరీక్ష వాయిదా పడుతుందన్న ప్రచారం, సిలబస్ మార్పులు జరిగాయన్న సమాచారం, ఉద్యోగాల విక్రయం జరుగుతోందన్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 2026 ఆగస్టు 22 నుంచి 29 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నియామకాల కోసం ఇప్పటికే 23 వేలకుపైగా దరఖాస్తులు అందాయని వెల్లడించారు. బ్రోకర్లకు దూరంగా ఉండాలని హెచ్చరిక ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులు, బ్రోకర్లు లేదా మోసగాళ్ల మాటలు నమ్మవద్దని అభ్యర్థులకు సూర్య సాయి ప్రవీణ్ చంద్ సూచించారు. ఎలాంటి సిఫార్సులు లేదా ఇతర మార్గాలు పనిచేయవని, అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.
వివరాలు
సిలబస్‌లో మార్పుల్లేవు
నోటిఫికేషన్‌లో ప్రకటించిన సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పరీక్షల్లో నకిలీ అభ్యర్థులు లేదా ఇతర అక్రమాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గత నియామకాలతో పోలిస్తే ఈసారి పరీక్షలకు సిద్ధం కావడానికి అభ్యర్థులకు అదనంగా 58 రోజుల సమయం కల్పించినట్లు గుర్తు చేశారు. అధికారికంగా విడుదల చేసే నోటిఫికేషన్లు, ప్రకటనలనే విశ్వసించాలని సూచించారు.
వివరాలు
ఫిర్యాదుల కోసం 24 గంటల ఆన్‌లైన్ సేవ
అభ్యర్థుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీ పవర్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో 24 గంటల పాటు పనిచేసే ఆన్‌లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ వ్యవస్థ అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగించాలంటే ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్టులను త్వరగా భర్తీ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. అందుకే నియామక ప్రక్రియను ఎలాంటి ఆలస్యం లేకుండా కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
వివరాలు
200 పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి
ఏపీట్రాన్స్‌కో ఇప్పటికే మొత్తం 200 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, టెలికాం విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నారు. అభ్యర్థులు జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000గా నిర్ణయించారు. పరీక్షలు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. సాధారణ అభ్యర్థులకు వయోపరిమితి 18 నుంచి 42 సంవత్సరాలుగా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.