అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే
కాఫీ పంటలకు, మిరియాల పంటలకు అరకులోయ ప్రసిద్ది చెందింది. ఇక్కడ పండే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అమెరికాలో సైతం అరకు కాఫీ లభిస్తుంది. అయితే అరకులోయలో కాఫీ పండించే రైతులకు భారత ప్రభుత్వం నుండి గుర్తింపు లభించింది. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి డివిజన్ లో, గొందిపాకుల, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలోని 1900మంది రైతులు, 2,184.76ఎకరాల్లో పండించే కాఫీ, మిరియాల పంటకు ఆర్గానిక్ (NPOP)సర్టిఫికేట్ వచ్చింది. ఈ విషయాన్ని కాఫీ, మిరియాలను కొనుగోలు చేసే గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వెల్లడి చేసింది. ఈ సర్టిఫికేటును అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ(APEDA) అందజేసింది.
నాలుగేళ్ల క్రితమే మొదలైన డాక్యుమెంటేషన్ పనులు
ఆర్గానిక్ సర్టిఫికేట్ కోసం నాలుగేళ్ళ క్రితమే డాక్యుమెంటేషన్ పనులు మొదలయ్యాయి. చివరికి ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చేసింది. ఇదే విధంగా జీకే వీధి, పెద్ద వలస, ఎర్ర చెరువులు క్లస్టర్లు కూడా ఆర్గానిక్ సర్టిఫికేట్ కోసం డాక్యుమెంటేషన్ పనులు పూర్తి చేసాయి. ఈ క్లస్టర్లలో మొత్తం 1300మంది రైతులు 3,393.78ఎకరాల్లో కాఫీ పంటను సాగు చేస్తున్నారు. ఈ కాఫీ పంటకు కూడా 2024సంవత్సరం ప్రారంభంలో ఆర్గానిక్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందని, గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వెల్లడి చేసింది. ఆర్గానిక్ సర్టిఫికేట్ వలన కాఫీ పంట రేటు పెరుగుతుందనీ, దీనివల్ల రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందని జీసీసీ వైస్ ఛైర్మన్ సురేష్ తెలిపారు.