Arava Sridhar Resignation: పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మహిళా వివాదంలో అరవ శ్రీధర్ పేరు వెలుగులోకి రావడంతో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు పవన్ కళ్యాణ్ ఆయనను అమరావతికి పిలిపించినట్లు సమాచారం. ఈ భేటీలో తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాలపై అరవ శ్రీధర్ పవన్ కల్యాణ్‌కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకూడదని పవన్ కల్యాణ్ సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ వివాదం నేపథ్యంలో అరవ శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం.
వివరాలు
వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు సమాచారం
అలాగే ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ రూపొందించిన నివేదికను కూడా పవన్ కల్యాణ్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య అరవ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాసనసభ విప్‌గా కొనసాగుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు స్వయంగా అందజేసినట్లు తెలుస్తోంది. అయితే, తన రాజీనామాపై స్పందించిన అరవ శ్రీధర్ వ్యక్తిగత కారణాలతోనే విప్ పదవికి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇటీవల తలెత్తిన వివాదాల ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతోంది.
వివరాలు
పలు అంశాలపై సమీక్షా సమావేశం
ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కూడా పవన్ కల్యాణ్ అమరావతికి పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశాలు జనసేన పార్టీలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల ప్రవర్తన, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశాలపై పవన్ కళ్యాణ్ కఠిన వైఖరి అవలంబిస్తున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.