Loading...
J&K: చైనా నిఘా వర్గాలకు సైనిక సమాచారం చేరవేత ఆరోపణలు.. తెలంగాణ మహిళపై కేసు
చైనా నిఘా వర్గాలకు సైనిక సమాచారం చేరవేత ఆరోపణలు.. తెలంగాణ మహిళపై కేసు

J&K: చైనా నిఘా వర్గాలకు సైనిక సమాచారం చేరవేత ఆరోపణలు.. తెలంగాణ మహిళపై కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా నిఘా వర్గాలకు భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలపై తెలంగాణకు చెందిన ఓ మహిళపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సేకరించిన సమాచారాన్ని విశ్లేషణాత్మక పత్రాల రూపంలో రూపొందించి, జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య వివరాలను విదేశీ వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆమెను విచారించినట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం.

వివరాలు 

సికింద్రాబాద్‌కు చెందిన మహిళ.. సైనికాధికారి భార్య

సికింద్రాబాద్‌కు చెందిన ఈ మహిళ జమ్ముకశ్మీర్‌లో పనిచేస్తున్న ఓ సైనికాధికారిని వివాహం చేసుకున్నారు.

ఆమె భర్త ప్రస్తుతం సైన్యంలో మేజర్‌గా పనిచేస్తున్నారు. 2023లో ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో ఐటీ రంగానికి సంబంధించిన ఇంటర్న్‌షిప్‌ చేసిన ఆమె.. ప్రస్తుతం ఫ్రీలాన్స్‌ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు.

భద్రత, రక్షణ, భౌగోళిక రాజకీయాలు, జమ్మూ కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, డ్రోన్ల మోహరింపు వంటి అంశాలపై ఆమె విశ్లేషణాత్మక కథనాలు రాసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

వివరాలు 

అధికార రహస్యాల చట్టం కింద కేసు

ఈ నెలలోని శుక్రవారం గాంధీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

గూఢచర్యం, భద్రతకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం, నేరపూరిత కుట్ర, జాతీయ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వంటి ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) నిబంధనల ప్రకారం కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు.

కేసు దర్యాప్తు కోసం డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు.

ADVERTISEMENT

వివరాలు 

రైల్వే స్టేషన్‌లో అదుపులోకి.. ఫోన్‌ స్వాధీనం

ఈ నెల 14న ఆమె పఠాన్‌కోట్‌కు వెళ్లేందుకు జమ్మూ తావి రైల్వే స్టేషన్‌కు వచ్చారు.

కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని సమీపంలోని సైనిక స్థావరానికి తరలించినట్లు సమాచారం.

అనంతరం ఆమె మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించారు.

ఫోన్‌లోని సమాచారం, ఇతర డిజిటల్‌ ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్నత విద్య.. పరిశోధనాత్మక కథనాలు

ఆమె 2021లో బెంగళూరులోని ఓ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ సంబంధాల అంశంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు.

అనంతరం 2022లో జెనీవాలో మాస్టర్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ యూరోపియన్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ గవర్నెన్స్‌ కోర్సును పూర్తి చేశారు.

దిల్లీలోని సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌లో ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌ కూడా చేశారు.

ఈ క్రమంలో పలు పరిశోధనాత్మక కథనాలను రచించారు. 2023 అక్టోబరులో సైన్యంలో మేజర్‌గా పనిచేస్తున్న అధికారిని ఆమె వివాహం చేసుకున్నారు.

ఆమె విద్యార్హతలు, పరిశోధన కార్యకలాపాలు, విదేశీయులతో పరిచయాలు సహా పలు అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

వివరాలు 

ఐరాస ఇంటర్న్‌షిప్‌ సమయంలో విదేశీయులతో పరిచయాలు

ఐరాసలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న సమయంలో ఆమె పలువురు విదేశీయులతో వాట్సప్‌ ద్వారా సంభాషించినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

వారిలో చైనా పౌరులు కూడా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇంటర్న్‌షిప్‌ పూర్తయిన తర్వాత కూడా వారిలో కొందరితో ఆమె వాట్సప్‌ ద్వారా సంబంధాలు కొనసాగించినట్లు వివరించారు.

2024లో సోషల్‌ మీడియా ద్వారా కన్సల్టెన్సీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మలేసియా జాతీయులతోనూ ఆమె సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వారు చైనా నిఘా వర్గాల కోసం పనిచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.

ఈ పరిచయాల ద్వారా సున్నితమైన సమాచారాన్ని ఆమె ఎవరితోనైనా పంచుకున్నారా అనే అంశంపై విచారణ చేస్తున్నారు.

వివరాలు 

ఏఐ ద్వారా బహిరంగ సమాచారమే సేకరించానన్న మహిళ

విచారణ సందర్భంగా తాను ఓపెన్‌ఏఐ, చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్‌ వంటి సంస్థల ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే సేకరించినట్లు ఆమె చెప్పారని పోలీసులు వెల్లడించారు.

అయితే ఆమె మొబైల్‌ ఫోన్‌ను ప్రాథమికంగా పరిశీలించగా, భారత్‌-ఇటలీ రక్షణ సంబంధాలపై మానెక్‌ షా సెంటర్‌లో జరిగిన సమావేశానికి సంబంధించిన రహస్య అంశాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

భారత సైన్యాధిపతి అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలు, భారత్‌-రష్యా రక్షణ ఒప్పందం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కలై-2 జలవిద్యుత్‌ ప్రాజెక్టు, కమలా ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం కూడా ఫోన్‌లో ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.

వీటితోపాటు భారత సైన్యం అనుసరించే కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌, భారత్‌-సీషెల్స్‌ సంబంధాలు, అస్సాంలోని ప్రాజెక్టులు, భారత్‌-చైనా సంబంధాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు.

వివరాలు 

విదేశీయులకు సమాచారాన్ని చేరవేశారా?

ఫ్రీలాన్స్‌ పరిశోధకురాలిగా పనిచేస్తున్న ముసుగులో ఆమె సేకరించిన సమాచారాన్ని విదేశీయులకు చేరవేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఆమె పరిశోధనల వెనుక ఉద్దేశం ఏమిటి? ఎవరితో సమాచారాన్ని పంచుకున్నారు? విదేశీ వ్యక్తులతో ఉన్న పరిచయాలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

ఆమె ఉపయోగించిన డిజిటల్‌ పరికరాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్రంగా విచారణ జరుపుతున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

సున్నితమైన సమాచారాన్ని ఎవరితో, ఏ కారణంతో పంచుకున్నారనే విషయాన్ని నిర్ధారించేందుకు ఆధారాలను సేకరిస్తున్నట్లు వివరించారు.

ఈ ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాతే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT