Page Loader
Myanmar soldiers: భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం.. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన మిజోరం 
Myanmar soldiers: భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం.. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన మిజోరం

Myanmar soldiers: భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం.. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన మిజోరం 

వ్రాసిన వారు Stalin
Jan 20, 2024
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లోకి భారీగా మయన్మార్ సైన్యం ప్రవేశించింది. దాదాపు 600 మంది మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశించడంతో మిజోరం కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. బుధవారం ఒక్కరోజే 276 మంది మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశించారు. మయన్మార్ మిలటరీ పాలన, తిరుగుబాటు దళాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో, దాదాపు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు ఆశ్రయం పొందేందుకు భారత్‌కు వచ్చారు. మిజోరం ప్రభుత్వం ఈ పరిస్థితిని భారత కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. సైనికులను త్వరగా స్వదేశానికి రప్పించాలని అభ్యర్థించింది. మిజోరంలోని ఆరు జిల్లాలు మయన్మార్ చిన్ రాష్ట్రంతో 510 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి.

భారత్

ఆంగ్ సాన్ సూకీ పతనం తర్వాత మొదలైన నిరసనలు

2021లో మయన్మార్ సైన్యం ఆంగ్ సాన్ సూకీ ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించింది. దీని తరువాత ఆర్మీ సైనిక చర్యకు దిగడంతో.. దేశంలో సాయుధ తిరుగుబాటు మొదలైంది. అనంతరం దేశంలో ప్రజా నిరసనలు కూడా పెరిగాయి. మూడు రెబల్స్ సమూహాలు గత అక్టోబర్‌లో భారీ దాడికి దిగాయి. అప్పటి నుంచి చైనా సరిహద్దుకు సమీపంలో ఉత్తరాన ఉన్న డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను మఅనేక పట్టణాలను రెబల్స్ సమూహాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ కూటమిలో అరకాన్ ఆర్మీ, మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ (MNDAA), తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (TNLA) ఉన్నాయి.

భారత్

అమిత్ షాకు వివరించిన సీఎం

షిల్లాంగ్‌లో శుక్రవారం జరిగిన ఈశాన్య మండలి సమావేశంలో మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈ అంశంపై వివరించారు. పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ స్థిరత్వంపై వాటి సంభావ్య ప్రభావాల గురించి ఆందోళనలు పెరుగుతున్నందున రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్న మయన్మార్ సిబ్బందిని త్వరగా వారి దేశానికి తిరిపి పంపించాలని కేంద్రాన్ని సీఎం కోరారు. బుధవారం ఒక్కరోజే 276 మంది మయన్మార్ సైనికులు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో మిజోరం-మయన్మార్-బంగ్లాదేశ్ సరిహద్దు ట్రైజంక్షన్‌లోని బందుక్‌బంగా గ్రామానికి చేరుకున్నారు. మయన్మార్ నుంచి ప్రజలు ఆశ్రయం కోసం భారత్‌కు వస్తున్నారని, మానవతా దృక్పథంతో వారికి సాయం చేస్తున్నామని సీఎం చెప్పారు.