India: తుక్కు సామగ్రితో కళా వైభవం.. 'స్వచ్ఛ భారత' సందేశాన్ని చాటుతున్న నితిన్ మెహతా శిల్పాలు
ఈ వార్తాకథనం ఏంటి
'కాదేదీ కవితకు అనర్హం' అన్న నానుడిని సాకారంగా నిలబెడుతూ, పనికిరాదని పడేసిన తుక్కు సామగ్రితో అద్భుతమైన కళారూపాలను సృష్టిస్తున్నారు ప్రముఖ కళాకారుడు నితిన్ మెహతా. పులులు, ఒంటెలు, నెమళ్లు వంటి విభిన్న జంతు రూపాలను శిల్పాలుగా మలుస్తూ, చెత్తనే కళగా మార్చుతున్నారు. రాజస్థాన్‌లోని అల్వర్ పట్టణంలోని కూడళ్లకు, బహిరంగ ప్రదేశాలకు అలంకారంగా మారిన ఈ శిల్పాలు, ఒకవైపు నగరానికి కొత్త అందాన్ని తీసుకువస్తూనే మరోవైపు 'స్వచ్ఛ భారత' సందేశాన్ని బలంగా చాటుతున్నాయి. ఈ వినూత్న ప్రాజెక్టును దిల్లీకి చెందిన ప్రముఖ కళాకారుడు నితిన్ మెహతానే చేపట్టారు.
Details
ప్రజలను ఆకర్షిస్తున్న శిల్పాలు
పాత చెత్తబుట్టలు, మూలన పడేసిన వాహనాలు, స్క్రూలు, యంత్రాల విడి భాగాలు వంటి పనికిరాని తుక్కంతా నితిన్ మెహతాకు కళా సామగ్రిగా మారింది. వాటితో నగరంలోని పార్కులు, కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో భారతదేశ మ్యాప్, యోగా చేస్తున్న మహిళ, భారీ నటరాజు వంటి ఆకృతులను రూపొందించారు. ఈ కళారూపాల ఏర్పాటు తర్వాత ఆయా ప్రాంతాలు పూర్తిగా కొత్త అందాలను సంతరించుకోవడంతో పాటు, చెత్తను పునర్వినియోగం చేస్తే ఎంత గొప్ప సృజనాత్మకతకు దారి తీస్తుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. అల్వర్ పట్టణంలో ఈ శిల్పాలు ప్రజలను ఆకర్షిస్తూ, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాయి.