LOADING...
ndian woman in China: అరుణాచల్ చైనాలో భాగం: షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళకు వేధింపులు
అరుణాచల్ చైనాలో భాగం: షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళకు వేధింపులు

ndian woman in China: అరుణాచల్ చైనాలో భాగం: షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళకు వేధింపులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారత మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌ చైనాదేనని వాదిస్తూ, ఆమె భారత పాస్‌పోర్ట్‌ను అంగీకరించేందుకు అక్కడి అధికారులు నిరాకరించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. నవంబర్ 21న ప్రేమ వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ అనే మహిళ లండన్‌ నుంచి జపాన్‌కు ప్రయాణిస్తున్న విమానం ఎక్కారు. ట్రాన్సిట్ కోసం విమానం షాంఘైలో దిగిన సమయంలో, స్థానిక ఇమిగ్రేషన్ అధికారులు ఆమె పాస్‌పోర్ట్‌ను పరిశీలించారు. అందులో ఉన్న జన్మస్థానం 'అరుణాచల్ ప్రదేశ్' అని గమనించిన వెంటనే, ఆమె పాస్‌పోర్ట్ సరైందికాదని చెప్పి నిలదీశారని ఆమె ఆరోపిస్తోంది. ఆ ఈశాన్య భారత రాష్ట్రం తమ దేశానికి చెందినదేనని అధికారులు పట్టుబట్టినట్లు తెలిపింది.

వివరాలు 

పాస్‌పోర్ట్‌ స్వాధీనం

ఇంతకంతకు ముందుకు వెళ్లి, తనను చూసి ఇమిగ్రేషన్ సిబ్బంది, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు నవ్వినట్లు, చైనీస్ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలని చేదోడుగా వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పేర్కొంది. చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారని, జపాన్‌కు వెళ్లాల్సిన తదుపరి విమానంలో ఎక్కనివ్వలేదని కూడా ఆమె తెలిపింది. ట్రాన్సిట్ ఏరియాలోనే ఆమెను నిర్బంధించారని, కొత్త టికెట్లు కొనడానికీ, తినడానికి ఆహారం తీసుకోవడానికీ అనుమతిచ్చలేదని వాంగ్‌జోమ్ వివరించింది.

వివరాలు 

ప్రధాన మంత్రి మోదీకి, మరికొందరు ఉన్నతాధికారులకు లేఖ

చివరికి యూకేలో ఉన్న తన స్నేహితురాలిద్వారా షాంఘైలోని భారత దౌత్య కార్యాలయానికి సమాచారం చేరడంతో సహాయం లభించిందని చెప్పింది. భారత అధికారుల జోక్యంతోనే తాను అక్కడి నుంచి బయటపడగలిగినట్లు వెల్లడించింది. ఈ ఘటన గురించి ఆమె ప్రధాన మంత్రి మోదీకి, మరికొందరు ఉన్నతాధికారులకు లేఖ రాసిందని కూడా తెలిపింది. ఈ ప్రవర్తన భారత సార్వభౌమత్వాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజల గౌరవాన్ని అవమానపరచడమేనని ఆ లేఖలో పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై అధికార వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన స్పందన వెలువడలేదు. ప్రస్తుతం ప్రేమ వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్నారు.