Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనను బలవంతం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే తాను మాత్ర బీజేపీ ఒత్తిడికి తలవంచేది లేదన్నారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నస్తున్నట్లు కేజ్రీవాల్ ఇటీవల చేసిన ఆరోపణలపై దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలపై కొనుగోలపై ఆధారాలను సమర్పించాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేజ్రీవాల్ కు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో మరోసారి కేజ్రీవాల్ బీజేపీపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
విద్య, వైద్యానికి కేవలం 4శాతమే కేటాయించిన కేంద్రం: కేజ్రీవాల్
ఇదిలా ఉంటే, కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో పెట్టిన బడ్జెట్‌పై కూడా కేజ్రీవాల్ విమర్శలు చేశారు. విద్య, వైద్యానికి కేంద్రం బడ్జెట్‌లో కేవలం 4 శాతం మాత్రమే కేటాయించినట్లు దుయ్యబట్టారు. దిల్లీ ప్రభుత్వం మాత్రం ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో 40 శాతం ఖర్చు చేస్తుందన్నారు. జైలులో ఉన్న తన సహచరులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను కూడా ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. మనీష్ సిసోడియా చేసిన తప్పు ఏమిటంటే అతను మంచి పాఠశాలలను నిర్మించడమే కేజ్రీవాల్ అన్నారు. మంచి ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లను నిర్మించడమే సత్యేంద్ర జైన్ చేసిన తప్పు అన్నారు. కేంద్రం ఈ పనులు చేయలేదు, చేసిన వాళ్లను అరెస్టు చేస్తుందని విమర్శించారు.