పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్‌కమ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత సోమవారం ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ జిందాబాద్ నినాదాలతో స్వాగతం పలికారు. మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని తిరిగి పొందడం గమనార్హం. లోక్‌సభలో మంగళవారం జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీ కీలక స్పీకర్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమ సాధించిన విజయం: కాంగ్రెస్
లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపై కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇది ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమ సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఇది న్యాయానికి, మన ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించినందున అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనాలని పార్టీ కోరుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తెలిపారు. 'మోదీ ఇంటిపేరు' పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో మార్చి 23 నుంచి రాహుల్ గాంధీపై లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది.