మధ్యప్రదేశ్: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి, పైపులతో కొట్టిన టీచర్లు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని కోచింగ్ సెంటర్‌లో టీచర్లు దారుణంగా వ్యవహరించారు. మాథ్స్ హోంవర్క్ పూర్తి చేయలేదని ఎనిమిదో తరగతి చదవుతున్న 13ఏళ్ల విద్యార్థిని ప్లాస్టిక్ పైపులతో కొట్టారు. అంతేకాదు, విద్యార్థిని బలవంతంగా టేబుల్‌పై పడుకోబెట్టి, కాళ్లు చేతులు పట్టుకొని చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులు కోచింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు విద్యార్థి పోలీసులకు చెప్పాడు. సెప్టెంబరు 2న 4గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోచింగ్ డైరెక్టర్ చంద్రకాంత్ మిశ్రా, కో-డైరెక్టర్ ప్రేమ్ శర్మ, ఉపాధ్యాయుడు అభిషేక్ రాహుల్ గుర్జార్, సంకేత్ భారతిపై జువైనల్ యాక్ట్ ఉల్లంఘన కింద పోలీసులు అభియోగాలు మోపారు.