జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం
జూన్ 22నుంచి హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచింది. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రకటించారు. జూన్ 22న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తొలి బోనం అమ్మవారికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా బోనాల పండగను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తలసాని వివరించారు.
జులై 9న సికింద్రాబాద్ బోనాలు
బోనాల ఉత్సవాల సందర్భంగా దాదాపు 26 ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం 'పట్టు వస్త్రాలు' అందజేయనుంది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనల చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేయనుంది. సికింద్రాబాద్ బోనాలు జులై 9న, లాల్ దర్వాజ బోనాలు జులై 16న నిర్వహించనున్నారు. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసారి తెలిపారు. బోనాల నిర్వహణ కోసం నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు.