Assam: అసోంలో యూసీసీ అమలుకు కేబినెట్ ఆమోదం.. మే 26న అసెంబ్లీలో బిల్లు
ఈ వార్తాకథనం ఏంటి
అసోం ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ యూసీసీ అమలుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మే 26న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. వివాహాలు, విడాకులు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు, పెళ్లిళ్ల తప్పనిసరి రిజిస్ట్రేషన్ వంటి అంశాలు ఈ చట్టంలో ఉండనున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, అందులో యూసీసీ కూడా భాగమేనని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అసోంలో తీసుకురానున్న యూసీసీ చట్టం ప్రధానంగా ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల నమూనాలను ఆధారంగా చేసుకుని రూపొందనుంది.
వివరాలు
వచ్చే ఆరు నెలల పాటు కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం
అయితే అసోంలోని మత సంప్రదాయాలు, ఆచారాలకు మినహాయింపు ఉంటుందని సీఎం తెలిపారు. అలాగే గిరిజన సమాజాలను కూడా ఈ చట్ట పరిధి నుంచి మినహాయిస్తామని తెలిపారు. బహుభార్యత్వంపై నిషేధం, పెళ్లిళ్ల తప్పనిసరి నమోదు, కుమార్తెలకు సమాన వారసత్వ హక్కులు వంటి నిబంధనలు ఇందులో ఉండే అవకాశముంది. ఇక యూసీసీ ప్రకటనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు నియంత్రణ చర్యలను కూడా ప్రకటించింది. వచ్చే ఆరు నెలల పాటు కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించారు. ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లకూడదని నిర్ణయించారు. అధికారిక కాన్వాయ్‌ల సంఖ్యను తగ్గించడంతో పాటు ఇంధన ఖర్చులను 20 శాతం వరకు తగ్గించనున్నారు.
వివరాలు
అద్దెకు ఎలక్ట్రిక్ వాహనాలు
అదే సమయంలో విదేశాల్లో తయారైన ఉత్పత్తులను ఆరు నెలల పాటు ప్రభుత్వం కొనుగోలు చేయదని సీఎం తెలిపారు. ఆఫ్‌లైన్ సెమినార్లు, వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించబోమన్నారు. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలనే అద్దెకు తీసుకోవాలని, పాత వాహనాలను స్క్రాప్ చేయనున్నట్లు ప్రకటించారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థ దెబ్బతింటోందని, ఇంధన పొదుపు, అవసరం లేని ప్రయాణాల తగ్గింపు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.