Loading...
Vijayawada: విజయవాడ దుర్గగుడిలో లడ్డూ విక్రయానికి ఏటీఎం తరహా యంత్రం ప్రారంభం
విజయవాడ దుర్గగుడిలో లడ్డూ విక్రయానికి ఏటీఎం తరహా యంత్రం ప్రారంభం

Vijayawada: విజయవాడ దుర్గగుడిలో లడ్డూ విక్రయానికి ఏటీఎం తరహా యంత్రం ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భక్తులకు లడ్డూ ప్రసాదం పొందడం మరింత సులభతరం చేసేలా ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్'లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ యంత్రాన్ని దుర్గగుడిలో ఏర్పాటు చేశారు. దేవస్థానం సెంట్రల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌ ప్రాంగణంలోని అర్జున వీధిలో రూ.6 లక్షల వ్యయంతో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, పాలకమండలి ఛైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌తో కలిసి బుధవారం యంత్రాన్ని ప్రారంభించారు.

వివరాలు 

డిజిటల్‌ సేవల్లో భాగంగా దుర్గగుడిలో కొత్త లడ్డూ విక్రయ విధానం

ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ మాట్లాడుతూ.. దేవాలయాల్లో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, దేవస్థానానికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

తాజాగా ఏర్పాటు చేసిన ఏటీఎం తరహా లడ్డూ యంత్రం ద్వారా భక్తులు ఇతరుల సహాయం లేకుండానే లడ్డూలను పొందవచ్చని తెలిపారు.

ఇందుకోసం చరవాణితో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, తమకు అవసరమైన లడ్డూ బాక్సుల సంఖ్యను ఎంపిక చేసుకుని నేరుగా ప్రసాదాన్ని పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

రాష్ట్రంలో తొలిసారిగా దుర్గగుడిలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

వివరాలు 

ఇతర ఆలయాల్లోనూ లడ్డూ యంత్రాల ఏర్పాటుకు పరిశీలన

ఈ పైలట్‌ ప్రాజెక్టు పనితీరును పరిశీలించిన అనంతరం ఇతర ప్రధాన దేవాలయాల్లోనూ ఇలాంటి లడ్డూ విక్రయ యంత్రాలను ఏర్పాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు.

భక్తులకు వేగంగా, సులభంగా ప్రసాదం అందించడంలో ఈ విధానం ఎంతవరకు ఉపయోగపడుతుందో పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామన్నారు.

మరోవైపు దసరా ఉత్సవాల్లో మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో ఆర్జిత సేవలు నిర్వహించాలని, మూలా నక్షత్రం రోజున భక్తులు పూజ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాలకమండలి సభ్యులు వినతి పత్రం అందజేశారు.

పాలకమండలి ఛైర్మన్‌ రాధాకృష్ణ ఈ వినతి పత్రాన్ని దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందించారు.

కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ధర్మారావు, శ్రీనివాసరావు, రాఘవరాజు, శంకర్‌బాబు పాల్గొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.2.08 కోట్లు

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థాన హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు.

14 రోజుల వ్యవధిలో హుండీల ద్వారా రూ.2,08,91,285 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

భక్తులు నగదు కానుకలతో పాటు 203 గ్రాముల బంగారం, 2.674 కిలోల వెండి వస్తువులను మొక్కుల రూపంలో సమర్పించారు.

విదేశీ కరెన్సీలో 192 అమెరికా డాలర్లు, 400 యూఏఈ దిర్హమ్స్‌, 80 ఇంగ్లాండ్‌ పౌండ్లు, 115 కెనడా డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 151 సౌదీ రియల్స్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియను దేవస్థానం ఈవో శీనానాయక్‌, ఏసీ రంగారావు పర్యవేక్షించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇంద్రకీలాద్రిపై రాష్ట్రంలోనే తొలిసారిగా 'లడ్డూ ప్రసాదం ఏటీఎం' ప్రారంభం

ADVERTISEMENT