Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన.. తెలంగాణలో ఎండలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏ మేరకు ఉంటుందనే విషయంపై రాబోయే రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ,దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై అధికారులు దృష్టి సారించారు.
వివరాలు
తెలంగాణలో ఎండలు, ఉక్కపోత
మరోవైపు,సాధారణంగా ఎల్ నినో (El Niño) ప్రభావం ఉన్న సంవత్సరాల్లో బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత, ఉక్కపోత పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ప్రస్తుతం వాతావరణం వర్షాకాలం నుంచి శీతాకాలానికి మారుతున్నందున ఇలాంటి పరిస్థితులు సహజంగానే ఏర్పడతాయని వివరించారు.
అయితే, ఈ పరిస్థితులపై ఎల్ నినో ప్రభావం కూడా ఉండే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం తెలంగాణ జిల్లాలపై ఏ మేరకు ఉంటుందనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.