పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశం
సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు ఒక రోజు ముందు అంటే 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని పార్టీలు సమావేశానికి హాజరుకావాలని ఈ-మెయిల్ ద్వారా విడివిడిగా ఆహ్వానాలను పంపారు. 17వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు అఖిలపక్ష ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. సెప్టెంబరు 18న ఉభయ సభల కార్యకలాపాలు పాత పార్లమెంట్ హౌస్‌లోనే జరుగుతాయి. 19వ తేదీ నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సభలు జరగనున్నాయి.
అజెండాపై అఖిలపక్ష సమావేశంలో చర్చించే అవకాశం
సెప్టెంబర్ 18 నుండి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు ఆగస్టు 31న జోషి ప్రకటించారు. అయితే ఈ సమావేశాల ఎజెండా ఎంటనేది ఆయన ప్రకటించలేదు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం ఎజెండాను వెల్లడించకపోవడంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రత్యేక సమావేశాల అజెండాపై అఖిలపక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఒకరికి తప్ప మరో వక్తికి తెలియదని ఆయన ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రతి ప్రత్యేక సమావేశాలు జరిగినప్పుడు ఎజెండా ముందుగానే తెలిసేదన్నారు.