Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు
బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన మహిళా హత్య ఉదంతం అక్కడి ప్రజల్ని తీవ్రంగా కలవరపెడుతోంది. మహాలక్ష్మి (29) అనే మహిళను చంపి, ఆమె శరీరాన్ని 31 ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో దాచిన కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన 2022లో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యను గుర్తు చేస్తోంది. కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర్ కేసు పురోగతిపై వెల్లడించారు. కేసుతో సంబంధం ఉన్న ప్రధాన అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించామని, అతడిని త్వరగా అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
అయితే ఇప్పటివరకు ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారని తెలిపారు. తన భర్త నుంచి విడిపోయిన మహాలక్ష్మి, బెంగళూరులోని వయ్యాలి కావల్ ప్రాంతంలో ఒంటరిగా నివసించేది. ఈ నెల ప్రారంభంలో ఆమె హత్యకు గురైంది. దుండగుడు ఆమె శరీర భాగాలను 31 ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో దాచినట్లు తెలుస్తోంది. కేసు వెలుగులోకి రాగానే బెంగళూరు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు.