Bharat Ratna CNR Rao: 'f' లెటర్ తంటా.. భారతరత్న సైంటిస్టు సీఎన్‌ఆర్ రావుకు ఎస్‌ఐఆర్ నోటీసు
ఈ వార్తాకథనం ఏంటి
నకిలీ ఓట్లను గుర్తించి తొలగించడం,అక్రమంగా చొరబడిన వారి పేర్లను ఏరివేయడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై రాజకీయంగానే కాకుండా న్యాయపరంగానూ తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా ఈ ప్రక్రియలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు (Chintamani Nagesa Ramachandra Rao)కు కర్ణాటకలోని SIR అధికారులు నోటీసు జారీ చేశారు. ఆయన వయసు 92సంవత్సరాలు. ఓటర్ల జాబితాలో నమోదైన పేరులోని చిన్న అక్షర దోషమే ఈ నోటీసుకు కారణమైంది.
వివరాలు
'Prof' కాస్త 'Proff'గా..
'Spelling Discrepancy'గా పేర్కొన్న ఈ వ్యత్యాసం కారణంగా భారతరత్న గ్రహీతకే నోటీసు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
'Self-name mismatch' (పేరు వ్యత్యాసం) కారణంగా ఈ నోటీసు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
2002లోని పాత ఓటర్ల జాబితాలో నమోదైన వివరాలు, ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలోని వివరాలతో సరిపోలనప్పుడు ఇలాంటి నోటీసులు ఇస్తారు.
సీఎన్‌ఆర్ రావు విషయంలో పాత ఓటర్ల జాబితాలో ఆయన పేరు 'Prof CNR Rao'గా నమోదై ఉంది.
అయితే తాజా ఓటర్ల జాబితాలో 'Prof' స్థానంలో పొరపాటున మరో 'f' చేరింది.
దీంతో ఆయన పేరు 'Proff CNR Rao'గా మారిపోయింది.ఈ స్వల్ప అక్షర వ్యత్యాసాన్ని'Self-name mismatch'గా పరిగణించిన అధికారులు..ఆయన గుర్తింపును నిర్ధరించుకునేందుకు నోటీసు జారీ చేశారు.
వివరాలు
ఎవరీ ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు?
బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో జరగనున్న విచారణకు సీఎన్‌ఆర్ రావు వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులో సూచించారు.
ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరు.
భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' అందుకున్న శాస్త్రవేత్తల్లో ఆయన మూడో వ్యక్తి. ఆయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్, కర్ణాటక రత్న వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు కూడా లభించాయి.
సాలిడ్-స్టేట్, స్ట్రక్చరల్ కెమిస్ట్రీ రంగాల్లో సీఎన్‌ఆర్ రావు విస్తృతంగా పరిశోధనలు చేశారు.
శాస్త్ర పరిశోధన, విధాన రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) అధిపతిగా ఆయన సేవలందించారు.
జవాహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR)కు వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
వివరాలు
వివిధ ప్రభుత్వాల హయాంలో కీలక బాధ్యతలు
దేశంలోని వివిధ ప్రభుత్వాల హయాంలోనూ శాస్త్ర, సాంకేతిక రంగంలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు.
మాజీ ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ, హెచ్.డి. దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్, మన్మోహన్ సింగ్ హయాంలో సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా, సభ్యుడిగా పనిచేశారు.
దేశ శాస్త్ర విధానాల రూపకల్పనలో తన అనుభవంతో కీలకంగా వ్యవహరించారు.