
Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల వసూళ్ల పరంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గతేడాది (2023-24)తో పోల్చితే 6 శాతం పెరుగుదల నమోదైందని ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
2024 మార్చి నెలలో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (CST),వ్యాట్ (VAT) వసూళ్లలో రూ.600 కోట్ల ఆదాయం వచ్చేలా అంచనా వేసినప్పటికీ, వాస్తవంగా రూ.500 కోట్ల మేర మాత్రమే వసూలైందని ఆయన వివరించారు.
రాష్ట్రంలో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాల విషయంలో మంచి అభివృద్ధి కనిపించినా,వ్యవసాయ భూములు,ఖాళీ స్థలాల విక్రయాల విషయంలో అనుకున్నంత పురోగతి కనిపించకపోవడం గమనార్హమని తెలిపారు.
ఈ అంశంపై గమనించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
వివరాలు
మంత్రివర్గ ఉపసంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన భట్టి విక్రమార్క
నిర్మాణ అనుమతుల జారీ ప్రక్రియలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ ఆర్థిక వనరుల సమీకరణ అంశంపై సోమవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశానికి భట్టి విక్రమార్క అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు డా.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ధర్మారెడ్డి శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమావేశంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ,తదితర లక్ష్యాలపై చర్చలు కొనసాగాయి.
వివరాలు
ఆబ్కారీ శాఖలో ఆదాయం వచ్చేలా చర్యలు
ఈ సందర్భంగా భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు సరైన ప్రణాళికతో పని చేయాలని స్పష్టం చేశారు.
టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ విస్తృత తనిఖీలు నిర్వహించడం ద్వారా శాఖల ఆదాయ వృద్ధికి సహకరించాలన్నారు.
ప్రత్యేకంగా, ఆబ్కారీ శాఖలో ఆదాయం తగ్గిన ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలానే గిరిజన ప్రాంతాల్లో ఇసుక అమ్మకాలను సొసైటీల ద్వారా నిర్వహించాలని, గిరిజన సంక్షేమ శాఖ అర్హులైన గిరిజనులను సొసైటీ సభ్యులుగా చేర్చి వారికి ఆదాయం అందేలా చూడాలన్నారు.
జిల్లాల కేంద్రాల్లో ఉన్న విలువైన భూములను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు స్పష్టంగా సూచించారు.