Loading...
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. తొలి రోజు 31 సర్వీసులు
తొలి రోజు 31 సర్వీసులు

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. తొలి రోజు 31 సర్వీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. జీఎంఆర్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విమానాశ్రయంలో సోమవారం నుంచి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆదివారం అర్ధరాత్రి నుంచే విమానాల రాకపోకలు మొదలయ్యాయి.

వివరాలు 

తొలి సర్వీసుగా సింగపూర్‌కు విమానం

భోగాపురం నుంచి తొలిసారిగా స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం రాత్రి సింగపూర్‌కు బయల్దేరింది.

అనంతరం సోమవారం ఉదయం 6.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది.

విమానానికి జీఎంఆర్ ప్రతినిధులు, జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందించారు.

ఉదయం నుంచే వరుస సర్వీసులు

ఉదయం 7.30 గంటల తర్వాత భోగాపురం నుంచి హైదరాబాద్‌కు తొలి విమానం బయల్దేరనుంది.

ఆ తర్వాత ఉదయం 8 గంటలకు బెంగళూరుకు, 8.20 గంటలకు దిల్లీకి, 8.50 గంటలకు హైదరాబాద్‌కు విమాన సర్వీసులు బయలుదేరనున్నాయి.

విశాఖపట్టణం నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకునేందుకు 20 విద్యుత్తు బస్సులను ఏర్పాటు చేశారు.

వివరాలు 

దేశీయ,అంతర్జాతీయ సర్వీసులు

భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి.

ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వంటి దేశీయ విమాన సంస్థలు సేవలు అందించనున్నాయి.

అంతర్జాతీయంగా ఎయిర్‌ ఇండియా, స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా సింగపూర్‌కు, ఇండిగో ద్వారా అబుధాబికి ప్రయాణించే అవకాశం ఉంది.

తొలి రోజే 31 సర్వీసులు

సోమవారం భోగాపురం విమానాశ్రయం నుంచి మొత్తం 31 విమాన సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి.

వీటి ద్వారా తొలిరోజే సుమారు 6 వేల నుంచి 7 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.

దీంతో ఉత్తరాంధ్రలో విమాన ప్రయాణానికి కొత్త కేంద్రంగా భోగాపురం ఎయిర్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చినట్లయింది.

ADVERTISEMENT

వివరాలు 

విశాఖ విమానాశ్రయంలో వాణిజ్య సేవలకు ముగింపు

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి చివరి వాణిజ్య సర్వీసుగా దిల్లీ విమానం ఆదివారం రాత్రి 10.45 గంటలకు బయల్దేరింది.

ఆ తర్వాత అక్కడి నుంచి వాణిజ్య విమాన సేవలు నిలిచిపోయాయి.

విశాఖ విమానాశ్రయంలో ఇప్పటివరకు సుమారు వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

అయితే ఇకపై వీరంతా ఎక్కడ విధులు నిర్వహించనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ADVERTISEMENT