Tirupati Airport Expands Runway: తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద రన్‌వే.. తిరుపతి విమానాశ్రయానికి నూతన గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో రన్‌వేను భారీగా విస్తరించారు. ఇకపై అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఉన్న 2,285 మీటర్ల రన్‌వేను 3,810 మీటర్ల వరకు పొడిగించారు. ఈ విస్తరణ పనులకు రూ.156.16 కోట్లు వ్యయం చేసినట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మానే శ్రీనివాస్ వెల్లడించారు.
రన్‌వే పొడిగింపుతో విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల కంటే ఇది అతిపెద్దదిగా నిలిచింది.
రన్‌వే విస్తరణతోపాటు విమాన మలుపు తీసుకునే మార్గాన్ని కూడా 700 మీటర్ల నుంచి 1,500 మీటర్లకు పెంచారు. దీని వల్ల బోయింగ్ 777 లాంటి పెద్ద విమానాలు సులువుగా మలుపు తిరిగే అవకాశముంది.
అంతర్జాతీయ విమాన సర్వీసుల నడిపేందుకు చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Details
రన్‌వేపై లైటింగ్ పనుల కారణంగా విమాన సర్వీసులు రద్దు
అయితే రన్‌వేపై లైటింగ్ పనుల కారణంగా ఇవాళ మధ్యాహ్నం 2.30 నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు.
దీంతో హైదరాబాద్, బెంగళూరు రూట్లలో ఇండిగో, స్పైస్‌జెట్ విమాన రాకపోకలపై ప్రభావం పడింది. తిరుపతి విమానాశ్రయంలో ఆధునిక నావిగేషన్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని-డైరెక్షనల్ రేంజ్, డిస్టెన్స్ మెజర్‌మెంట్ ఎక్విప్‌మెంట్ వంటి అధునాతన వ్యవస్థలతో విమాన ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తున్నారు.
రాయలసీమ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి నేరుగా కువైట్ విమానం ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా ఉంది.