మధ్యప్రదేశ్: 92మంది అభ్యర్థులతో బీజేపీ 5వ విడత జాబితా రిలీజ్.. సింధియా అత్తకు నో టికెట్
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కుస్తీ పడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే నాలుగు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, శనివారం 92 మంది అభ్యర్థులతో 5వ విడతను ప్రకటించింది. అక్టోబర్ 20వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు 92 మంది సభ్యులను ఫైనల్ చేశారు.
ముగ్గురు మంత్రులకు టికెట్ నిరాకరణ
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 అసెంబ్లీ స్థానాలు కాగా, శనివారం ప్రకటించిన జాబితాతో కలిపి 228 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకో ఇద్దరు సభ్యులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ కుమారుడు ఆకాశ్ విజయవర్గీయ సీటును మరోకరికి బీజేపీ కేటాయించడం గమనార్హం. అలాగే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అత్త యశోధర రాజే సింధియాకు కూడా బీజేపీ టికెట్ నిరాకరించింది. యశోధర రాజేతో పాటు మొత్తం ముగ్గురు మంత్రులకు బీజేపీ టికెట్ కేటాయించకపోవడం గమనార్హం. అంతేకాకుండా, జబల్‌పూర్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందిని మరావిని పార్టీ పక్కన పెట్టింది. రెండో జాబితాలో 12 మంది మహిళలకు బీజేపీ టిక్కెట్లు కేటాయించింది.