BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లగా, తాజాగా బీజేపీ కూడా ప్రచార పర్వంలో దూసుకెళ్లాలని చూస్తోంది.
అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి, జాతీయ నేతలతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలంగాణ బీజేపీ భావిస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే తెలంగాణలో ఎవరు ప్రచారం చేసే నేతలకు సంబంధిన జాబితాను కూడా సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో ఈనెల 20 నుంచి బీజేపీకి చెందిన అగ్రనేతలను ఎన్నికల ప్రచారంలోకి దింపుతోంది పార్టీ అధిష్టానం.
తొలి విడతగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, స్మృతి ఇరాని, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
తెలంగాణ
గజ్వేల్ నుంచి బండి సంజయ్ పోటీ?
ఈనెల 20 నుంచి అమిత్ షా, స్మృతి ఇరాని, యోగీ ఆధిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు.
పది రోజుల పాటు ఈ నేతలు తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఈనెల 20న కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, 27న మంత్రి అమిత్ షా, 28న హిమంత బిశ్వశర్మ, 31న యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇదిలా ఉంటే, గజ్వేల్ నుంచి బండి సంజయ్‌ను బరిలోకి దింపాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా బీజేపీ నేత విజయశాంతి కూడా గజ్వేల్ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ అంటూ ట్వీట్ చేయడం తెలంగాణలో రాజకీయాల్లో సంచలనంగా మారింది.