ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ.. వచ్చేఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో జరగనన్ను ఎలక్షన్లపై ఫోకస్ పెట్టింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో 2023 ప్రారంభంలో.. మిజోరాంలో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో విజయతీరాలను తాకేందుకు ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్ షా ద్వయం ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల వీరు మేఘాలయలో పర్యటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను ఒకసారి పరిశీలిద్దాం. త్రిపుర: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ 35 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 మంది సభ్యుల గల అసెంబ్లీలో.. బీజేపీ, దాని ప్రత్యర్థి వామపక్షాల మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువగా ఉంది.
మిజోరంను గెలిచేనా?
మేఘాలయ: 2018ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోలేకపోయింది. దీంతో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఎన్‌పీపీ అధినేత కాన్రాడ్ సంగ్మా ఇప్పటికే ప్రకటించారు. నాగాలాండ్: 2018లో ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి.. 40 నియోజకవర్గాల్లో ఎన్‌డీపీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. మిజోరం: 2023ఎన్నికల్లో మిజోరంలోని మొత్తం 40 స్థానాల్లో తమ పార్టీ పోటీచేస్తుందని మిజోరం బీజేపీ చీఫ్ వన్‌లాల్‌ముకా ఇప్పటికే ప్రకటించారు. 2018లో మొదటిసారిగా బీజేపీ మిజోరంలో ఖాతా తెరిచింది.