LOADING...
U.S: గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా అణు పరీక్షలు..వివరాలు బహిర్గతం చేసిన అమెరికా
గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా అణు పరీక్షలు..వివరాలు బహిర్గతం చేసిన అమెరికా

U.S: గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా అణు పరీక్షలు..వివరాలు బహిర్గతం చేసిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించిందన్న విషయాన్ని అమెరికా బయటపెట్టింది. 2020 జూన్‌లో బీజింగ్‌ అణు పరీక్షలు చేపట్టిందని అమెరికా విదేశాంగ శాఖ అండర్‌ సెక్రటరీ క్రిస్టోఫర్‌ యే వెల్లడించారు. భారత్‌-చైనా సరిహద్దులో గల్వాన్‌లో జరిగిన ఘర్షణల తర్వాత కొద్దిరోజుల్లోనే ఈ పరీక్షలు జరగడం విశేషంగా పేర్కొన్నారు. అమెరికా-రష్యాల మధ్య కుదిరిన అణు ఒప్పందం ఇటీవల ముగిసిన నేపథ్యంలో, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరాయుధీకరణ సమావేశంలో పాల్గొన్న క్రిస్టోఫర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఉద్దేశపూర్వకంగా తన అణు సామర్థ్యాన్ని వేగంగా విస్తరించుకుంటోందని ఆయన ఆరోపించారు. బీజింగ్‌ విధానాల్లో పారదర్శకత లేనందుకు ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

చైనాలోని లాప్‌ నుర్‌ భూగర్భ కేంద్రం వద్ద 2.75 తీవ్రతతో ప్రకంపనలు

2020 జూన్‌ 22న చైనాలోని లాప్‌ నుర్‌ భూగర్భ కేంద్రం వద్ద 2.75 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు తెలిపారు. ఈ ప్రకంపనలను కజికిస్తాన్‌లో ఉన్న అంతర్జాతీయ మానిటరింగ్‌ కేంద్రం గుర్తించిందని చెప్పారు. అవి సాధారణ భూకంపం వల్ల గానీ, గనుల తవ్వకాల వల్ల గానీ సంభవించినట్లుగా కనిపించడం లేదని పేర్కొన్నారు. అమెరికా తరహాలో అణు పరీక్షా కేంద్రాల తనిఖీకి బీజింగ్‌ అనుమతించకపోవడంతో పరీక్షల ధృవీకరణ క్లిష్టమైందని తెలిపారు. ఈ అంశంపై దౌత్యపరమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

వివరాలు 

బీజింగ్‌ వద్ద అమెరికా, రష్యాల కంటే తక్కువ అణ్వాయుధాలే..

అదే సమావేశంలో పాల్గొన్న చైనా రాయబారి జియాన్‌ సెన్‌ అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బీజింగ్‌ అణు విధానాన్ని కొన్ని దేశాలు తప్పుదారి పట్టించేలా చూపుతున్నాయని విమర్శించారు. యూఎస్‌ చేసిన ఆరోపణలు ఆధారంలేనివని అన్నారు. అణు పరీక్షలను మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సాకులు వెతుకుతోందని, అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఇతర దేశాలను అపప్రథకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా బీజింగ్‌ వద్ద అమెరికా, రష్యాల కంటే తక్కువ అణ్వాయుధాలే ఉన్నాయని తెలిపారు. అణ్వాయుధ నియంత్రణకు సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందంలో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి చేయడం అన్యాయమని పేర్కొన్నారు.

Advertisement