Maharashtra: ముంబై-వడోదర హైవేపై విషాదం.. 250 కిమీ వేగంతో దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు బోల్తా
ఈ వార్తాకథనం ఏంటి
అతివేగం మరోసారి ఇద్దరు యువతీయువకుల ప్రాణాలను బలితీసుకుంది. మహారాష్ట్రలోని ముంబై-వడోదర హైవేపై బదలాపూర్ సమీపంలో ఆదివారం (జూన్ 21) తెల్లవారుజామున జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో విలాసవంతమైన బీఎండబ్ల్యూ జడ్4 స్పోర్ట్స్ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదం సంభవించిన సమయంలో కారు గంటకు సుమారు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టిన కారు గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత ఎంత ఘోరంగా ఉందో వాహనం శిథిలాలు, మృతుల శరీర భాగాలు సంఘటనా స్థలానికి కొంత దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోవడాన్ని బట్టి అర్థమవుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాలు
తీవ్రంగా గాయపడిన మూడో వ్యక్తి
ఈ ప్రమాదంలో బదలాపూర్‌కు చెందిన యోగేష్ దిఘే (26), రికేబా జాకబ్ (24) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆనంద్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం,వీరంతా టిట్వాలాలో జరిగిన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై బదలాపూర్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి తర్వాత అతివేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
బ్లడ్ శాంపిళ్లు,ఇతర కీలక ఆధారాలను సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై బదలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ జరిగిన మరణాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. శనివారం రాత్రి జరిగిన పార్టీ సందర్భంగా మద్యం సేవించారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు బ్లడ్ శాంపిళ్లు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పల్టీలు కొట్టిన లగ్జరీ కారు,ఇద్దరు మృతి
मुंबई से सटे बदलापुर इलाके ने BMW कार का बड़ा हादसा..
— Vivek Gupta (@imvivekgupta) June 22, 2026
BMW की स्पीड ज्यादा होने से हाईवे की फेन्स में जा घुसी..
2 की मौत, और एक गंभीर रूप से घायल.
बताया जा रहा है कि BMW की रफ्तार 250 किलोमीटर प्रति किलोमीटर की थी.
पीड़ित अपनी बर्थडे पार्टी मना कर मुंबई की तरफ आ रहे थे. pic.twitter.com/ooyYGTvzNW