Old Currency Notes: 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లుబాటు కావా? అసలు నిజం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు సంబంధించిన పలు రకాల వార్తలు తరచూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తుంటాయి. ముఖ్యంగా గతంలో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం, అనంతరం రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవడం వంటి పరిణామాల తర్వాత కరెన్సీ నోట్లపై తప్పుడు ప్రచారాలు పెరిగాయి. ఇటీవల మరోసారి 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు జూన్ 30 తర్వాత చెల్లవని ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేరుతో ఒక నకిలీ సర్క్యులర్ వైరల్ కావడంతో పలువురు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
వివరాలు
ఆ వార్తలు అవాస్తవం..
ఈ ప్రచారంపై స్పందించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. 2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను జూన్ 30 తర్వాత తమ శాఖల్లో స్వీకరించబోమని ఎలాంటి ప్రకటన లేదా సర్క్యులర్ జారీ చేయలేదని తెలిపింది. వినియోగదారులు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అలాగే వాటిని ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. అధికారిక వనరుల ద్వారా విడుదలయ్యే ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని బ్యాంక్ పేర్కొంది. ఈ తప్పుడు ప్రచారంపై అవగాహన కల్పిస్తూ #FakeMessageAlert హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఉపయోగించింది.
వివరాలు
అదొక ఫేక్ న్యూస్..వాటిని నమ్మొద్దు..
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసు పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాల పేరుతో 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను 2026 జూలై 1 నుంచి స్వీకరించరని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇలాంటి నోటీసును ఎప్పుడూ జారీ చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. 2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లు ఇప్పటికీ పూర్తిగా చెల్లుబాటులోనే ఉన్నాయని, వాటి వినియోగంపై ఎలాంటి నిషేధం లేదని పేర్కొంది. ఈ విషయంపై ఆర్బీఐ కూడా స్పష్టత ఇచ్చిందని వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
🚨Do not fall for fake news!
— PIB India (@PIB_India) June 27, 2026
A notice allegedly issued by Bank of Maharashtra is being shared online, falsely stating that, as per RBI directives, ₹10, ₹20, ₹50, and ₹100 banknotes printed before 2005 will not be accepted from July 1, 2026#PIBFactCheck: ❌ This claim is… https://t.co/mF7fdyQWvm