Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌కు షాక్.. పిటిషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తనపై కొనసాగుతున్న పరువునష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగనున్నాయి. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై దేశవ్యాప్తంగా రాజకీయ వివాదం కొనసాగుతున్న సమయంలో రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీని ఉద్దేశిస్తూ 'కమాండర్ ఇన్ థీఫ్' అనే పదాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ సామాజిక మాధ్యమాలతో పాటు వివిధ సభల్లోనూ ప్రస్తావించారు.
వివరాలు
బీజేపీ కార్యకర్త ఫిర్యాదుతో కేసు
రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త మహేష్ శ్రీమల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు పరువునష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ఆయన బాంబే హైకోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రాహుల్‌గాంధీకి సమన్లు జారీ చేసింది.
కోర్టు సమన్లు జారీ చేయడంతో తనపై కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ రాహుల్‌గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాహుల్ అభ్యర్థనను అంగీకరించలేదు.
ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహేష్ శ్రీమల్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ ముందుకు సాగనుంది.