Putin: బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం పెరుగుతోంది: పుతిన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీ7 దేశాల వాటా తగ్గుతుండగా..బ్రిక్స్ దేశాల ఆర్థిక ప్రాధాన్యం పెరుగుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో జీ7దేశాల వాటా సుమారు 18శాతం కాగా.. బ్రిక్స్ దేశాల వాటా దాదాపు 40శాతంగా ఉందని తెలిపారు. ''వాళ్లను అలా ఎందుకు పిలుస్తారో నాకు తెలియదు''అంటూ జీ7కూటమి ప్రాధాన్యాన్ని ప్రశ్నించారు. క్రిమియాను 2014లో రష్యా విలీనం చేసుకున్న నేపథ్యంలో అప్పటివరకు జీ8లో సభ్యదేశంగా ఉన్న రష్యాను కూటమి నుంచి తొలగించారు. దీంతో ఆ సమూహం తిరిగి జీ7గా మారింది. మారుతున్న ప్రపంచ వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం, ప్రభావం పెరుగుతున్నాయని పుతిన్ పేర్కొన్నారు.
వివరాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక కూటమిగా బ్రిక్స్: పుతిన్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక కూటమిగా బ్రిక్స్ అవతరించిందని అన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర కూడా పెరుగుతోందని ప్రస్తావించిన ఆయన.. ప్రస్తుతం భారీ ఆర్థిక మార్పు జరుగుతోందని చెప్పారు.
బ్రిక్స్ కూటమి వెలుపల ఉన్న దేశాలతోనూ సహకారానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
బ్రిక్స్ దేశాలను బలహీనపరిచేందుకు పాశ్చాత్య దేశాలు పదేపదే ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు.
''బ్రిక్స్ పాశ్చాత్య ప్రత్యర్థులు తమ గత నాయకత్వాన్ని తిరిగి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పోరాటం ప్రభుత్వ స్థాయిలో అనుచితమైన మలుపు తీసుకుంటోంది'' అని వ్యాఖ్యానించారు.
రష్యాపై పాశ్చాత్య దేశాలు అన్యాయమైన ఆంక్షలు విధించాయని ఆరోపించిన పుతిన్.. ఆంక్షలు ఉన్నప్పటికీ తమ దేశ ఆర్థిక పనితీరు నిలకడగా కొనసాగిందని తెలిపారు.
వివరాలు
మోదీ-పుతిన్ ద్వైపాక్షిక చర్చలు
మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా బ్రిక్స్ సభ్యదేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు.
బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు.
ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన తర్వాత రష్యా వెలుపల జరిగిన బ్రిక్స్ సదస్సులో పుతిన్ ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది మోదీ, పుతిన్ భేటీ కావడం ఇది రెండోసారి. ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే ముందున్న ఏకైక మార్గాలని మోదీ పునరుద్ఘాటించారు.
శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
వివరాలు
నల్ల సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలపైనా మోదీ,పుతిన్ చర్చ
రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాల మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని నేతలు సమీక్షించారు.
పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలపైనా మోదీ, పుతిన్ చర్చించారు.
ముఖ్యంగా సముద్ర వాణిజ్యంపై వాటి ప్రభావం, భారతీయ నావికుల భద్రత వంటి అంశాలను ప్రస్తావించారు.
2026లో భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఈ కూటమిలో భారత్-రష్యా సహకారాన్ని కూడా ఇరువురు సమీక్షించారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ స్థిరంగా కొనసాగుతున్న తమ ''ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని'' మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించారు.