కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సోమవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కాంగ్రెస్ టిక్కెట్ కోసం రేఖానాయక్ ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో వేడి రాజేస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ స్థానంలో ఎన్ఆర్ఐ, జాన్సన్ రాథోడ్ నాయక్‌కు గులాబి అధిష్టానం టిక్కెట్ ఖరారు చేసింది. ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ నాయక్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్‌లో పోటీ చేసేందుకు స్వయంగా దరఖాస్తు సమర్పించగా, ఎమ్మెల్యే రేఖా తరఫున ఆమె పీఏ గాంధీభవన్ లో దరఖాస్తు అందజేశారు.
ఇప్పటికీ బీఆర్ఎస్ క్యాడర్ నాతోనే ఉంది : రేఖానాయక్
కచ్చితంగా తాను ఎన్నికల బరిలో ఉంటానని రేఖా తేల్చి చెప్పారు. ఇప్పటికీ బీఆర్ఎస్ క్యాడర్ తనతోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న 50 రోజులు నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతానన్నారు. మంత్రి పదవి రేసులో ఉన్న కారణంగానే కుట్రలతో తప్పించారన్నారు. బీఆర్ఎస్‌లో కేవలం అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. జాన్సన్ నాయక్ ఎస్టీ కాదని ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని రేఖా ఆరోపణలు గుప్పిస్తున్నారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు రేఖా వర్గం చెబుతోంది. మరోవైపు గాంధీభవన్‌కు ధరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్న వారి నుంచి పార్టీ ధరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మేరకు 5 రోజుల్లోనే దాదాపుగా 280 ధరఖాస్తులు వచ్చినట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.