హైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం.. స్కూటీ నుంచి జారిపడ్డ చిన్నారిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మహానగరం పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సిటీలోని గుంతల రోడ్లు ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకరమైన ఘటన బాచుపల్లిలో చోటు చేసుకుంది.
గత కొద్ది రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో బల్డియా పరిధిలోని రోడ్ల మీద భారీ గుంతలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే తండ్రి కిషోర్ తో కలిసి ద్విచక్రవాహనంపై స్కూలుకు వెళ్తున్న రెండో తరగతికి చెందిన చిన్నారి దీక్షిత ప్రమాదంలో ప్రాణం విడిచింది.
ఇంటి నుంచి ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లేందుకు పాప తండ్రి వాహనం సిద్ధం చేశాడు.
దీంతో చిన్నారి స్కూటీ ఎక్కి కూర్చుంది. అప్పటికే ఎడతెరిపి లేని వర్షాలకు రోడ్లు భారీగా గుంతలు పడ్డాయి.
DETAILS
తీవ్ర శోకంలో మునిగిన బాధిత కుటుంబం
రోడ్ల మీద దుస్థితిని గమనించిన బాలిక తండ్రి అప్రమత్తమయ్యాడు. ఈ క్రమంలోనే వాహనాన్ని మెల్లగా నడిపించాడు.
కానీ స్కూటీ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సమీపంలోకి వచ్చాక పొరపాటున ఓ గుంతలో నుంచి వెళ్లారు. దీంతో అదుపుతప్పిన పాప ప్రమాదవశాత్తు ఎగిరి కిందపడింది.
ద్విచక్ర వాహనం వెనకాలే దూసుకువచ్చిన ఓ స్కూల్ బస్సు చిన్నారిపై నుంచి వెళ్లింది. ఘటనలో తీవ్రగాయాలపాలైన చిన్నారి దీక్షిత అక్కడికక్కడే ఊపిరి విడిచింది.
రోజూ బడికి వెళ్లి ఇంటికి చేరుకునే చిన్నారి ఇక లేదని తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.
కుమార్తె ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేని బాలిక తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం ఇరుగు పొరుగును తీవ్రంగా కలిచివేస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.